
అదృష్టమంటే నాదే
అదృష్టమంటే సనమ్ శెట్టిదే. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి లెగ్ పెట్టిందో లేదో అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించే అదృష్టం వరించింది. 'ఇంటింటా అన్నమయ్య' చిత్రంలో హీరోయిన్గా నటించినా ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. అది వేరే సంగతి. అయితే ఈ అమ్మడుకి మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం సనమ్ శెట్టిని తలుపు తట్టింది. అదికూడా ఆడిషన్స్ లేకుండానే డైరెక్ట్గా ఎంపికైంది.
ఇక దర్శకేంద్రుడు దర్శకత్వంలో పని చేయాలని... ప్రిన్స్ మహేష్ సరసన నటించాలని ఇండస్ట్రీకి వచ్చిన ఏ హీరోయిన్ అయిన కల కంటుంది. చాలాఏళ్ల తర్వాత కానీ హీరోయిన్లకు ఈ అవకాశం రాదు. అటువంటింది సనమ్ను హీరోయిన్గా తీసుకోవాలని దర్శకుడు కొరటాల శివ చెప్పడం... అందుకు మహేష్ బాబు ఓకే చెప్పడం చకచక జరిగిపోయాయి.
దాంతో సనమ్ మాత్రం ఆనందంతో తబ్బిబ్బు అవుతోంది. తాను రెండు సార్లు లక్కీఛాన్స్ కొట్టేశానని సంబరపడుతుంది. అంతేనా మొట్టమొదటి సారిగా మహేష్ బాబును కలిసినప్పుడు చాలా ఆందోళన పడ్డానని... అలాగే చాలా ఒత్తిడి అనుభవించానని చెప్పింది. కానీ మహేష్తో మాట్లాడిన తర్వాత ఒత్తిడితో ఆందోళన మాయమైందని చెప్పుకొచ్చింది.
మహేష్ బాబు చుట్టు ఓ తేజోవంతమైన కిరణాలు (ఆరా) తిరుగుతుంటాయని సనమ్ చెప్పడం విశేషం. ఇక మహేష్ బాబుతో పాటు సీనియర్ నటులు సుకన్య, జగపతి బాబులతో కలిసి నటిస్తుంటే కొత్త విషయాలు ఎన్నో తెలుస్తున్నాయని పేర్కొంది. చిత్రసీమలో ప్రవేశించిన కొద్దికాలంలో ఇటువంటి అవకాశాలు వస్తాయని జీవితంలో ఎప్పుడు అనుకోలేదని సనమ్ శెట్టి తనకు 'పట్టిన' అదృష్టాన్ని చూసి తానే ఆశ్చర్యపోతోంది.