సైన్స్‌లో సగం సిలబస్ ప్రాక్టికల్స్‌కే! | Science half Practicals syllabus! | Sakshi
Sakshi News home page

సైన్స్‌లో సగం సిలబస్ ప్రాక్టికల్స్‌కే!

Published Fri, Jan 29 2016 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

సైన్స్‌లో సగం సిలబస్ ప్రాక్టికల్స్‌కే!

సైన్స్‌లో సగం సిలబస్ ప్రాక్టికల్స్‌కే!

* ఇంటర్ సైన్స్ గ్రూపుల్లో అమలు చేయాలని సిలబస్ కమిటీ ప్రతిపాదన
* మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పూర్తిగా ఒకే సిలబస్
* ఇతర గ్రూపుల్లో 70 శాతం కామన్ కోర్ సిలబస్‌కు చర్యలు
* వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం


సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లోని సైన్స్ గ్రూపుల్లో 50 శాతం సిలబస్‌ను ప్రాక్టికల్స్‌కే కేటాయించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్ సిలబస్ సమీక్ష కమిటీ అభిప్రాయపడింది. జాతీయ స్థాయి విద్యా సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్, సీబీఎస్‌ఈ విద్యాసంస్థల్లోని 10+2 విధానంలో ఉమ్మడి (కామన్ కోర్) సిలబస్ ఉండేలా చర్యలు చేపట్టాలని తీర్మానించింది.

అయితే సైన్స్ గ్రూపులకు చెందిన సబ్జెక్టు (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)ల్లో మాత్రం 100 శాతం కామన్ కోర్ సిలబస్ (అన్ని రాష్ట్రాల్లో ఒకేలా) ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఇందులో 50 శాతం పాఠ్యాంశాలు రాత పరీక్షల కోసం ఉండాలని, మరో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ థియరీకి అనుగుణంగా ఉందని, దాన్ని మార్చాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, సీబీఎస్‌ఈ ప్రతినిధులతో కూడిన కమిటీ ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైంది.

సిలబస్ సమీక్ష కమిటీ కన్వీనర్, రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు జమ్మూకశ్మీర్ ఇంటర్ బోర్డు చైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్ అసానో సెఖోస్, ఐసీఎస్‌సీ ప్రతినిధులు కల్నల్ శ్రీజిత్, శిల్పిగుప్తా, ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధులు రంజనా అరోరా, సీబీఎస్‌ఈ అదన పు డెరైక్టర్ సుగంధ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్స్ గ్రూపులతోపాటు ఇతర గ్రూపులు, సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు.

మిగతా 30 శాతం సిలబస్‌ను ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్ర మానవ వనరుల శాఖకు పంపారు. ఇతర గ్రూపుల్లోనూ 90 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండాలని... 5 నుంచి 10 శాతం వరకే మార్చుకొనేందుకు అవకాశం కల్పించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మొత్తంగా కామన్ కోర్ సిలబస్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement