
రెండుగంటల్లోనే రెండు బ్యాంకులు లూటీ!
న్యూఢిల్లీ: తీవ్ర కల్లోలంగా ఉన్న కశ్మీర్‌లో రెండు గంటల వ్యవధిలోనే రెండు బ్యాంకులు లూటీకి గురయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఉగ్రవాదులు మొత్తంగా మూడు బ్యాంకులను కొల్లగొట్టడం గమనార్హం. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపూరలోని ఓ బ్యాంకును గుర్తు తెలియని సాయుధులు దోచుకున్నారు. జమ్మూకశ్మీర్ నిహామా శాఖలో ఈ దోపిడీ జరిగింది.
ఆయుధాలతో వచ్చిన దుండగులు భయభ్రాంతులకు బ్యాంకులోని వారిని గురిచేస్తూ డబ్బును ఎత్తుకెళ్లారని, వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరారైన దొంగలను అరెస్టుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. అంతకుముందు రెండు గంటల కిందటే పుల్వామా జిల్లాలోని వాహిబాగ్ గ్రామంలో ఉన్న ఎల్లాక్వై దేహాతి బ్యాంకులోనూ దోపిడి జరిగింది. మంగళవారం యారిపూర బ్యాంకులోనూ సాయుధులు బీభత్సం సృష్టించి దోచుకెళ్లిన సంగతి తెలిసిందే.