సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై ఎన్ని కమిటీలు వేసినా సమైక్యవాదాన్నే వినిపిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ‘విభజన విషయంలో ప్రభుత్వ కమిటీ వేస్తారన్న విషయంపై మాకు సమాచారం లేదు. కమిటీ వేసినా అది ఏ ప్రాతిపదికన వేశారు? దాని విధివిధానాలు ఏమిటి? ప్రభుత్వ కమిటీ సైతం ఆంటోనీ కమిటీ వంటిదేనా? అన్న విషయాలను ముందే తేల్చాలి’ అని చెప్పారు. హైదరాబాద్, నీటి సమస్యలు పరిష్కారించాకే విభజనపై నిర్ణయం చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నమిక్కడ కేంద్ర మంత్రి చిరంజీవి ఇంట్లో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీల విందు సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్‌కుమార్, కనుమూరి బాపిరాజు, బొత్స ఝాన్సీ, మాగుంట శ్రీనివాసులరెడ్డి, కేవీపీ రాంచంద్రరావు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. సస్పెన్షన్ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి.. ఆంటోనీ కమిటీని మరోమారు కలిసే అంశాలపై చర్చించారు. సమావేశం జరుగుతుండగా మధ్యలోనే లోక్‌సభకు వెళ్లిన చిరంజీవి సమావేశం ముగిసిన అనంతరం తిరిగొచ్చారు. శుక్రవారం తాను సోనియాగాంధీతో జరిపిన భేటీ విషయాలు నేతలకు ఆయన వివరించారు. ఎంపీలందరూ సోమవారం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు.
అన్ని వర్గాలవారితో ఆంటోనీ కమిటీ భేటీ: పళ్లంరాజు
సాక్షి, హైదరాబాద్: అన్నివర్గాల ప్రజలతో ఆంటోనీ కమిటీ భేటీ అవుతుందని కేంద్రమంత్రి పళ్లంరాజు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌కు వచ్చే ఈ కమిటీ విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాలవారితో సమావేశమై వారికున్న భయాందోళనలపై వివరాలు తీసుకుంటుందన్నారు.
ఎన్ని కమిటీలేసినా.. సమైక్యమే
Published Sun, Aug 25 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement
Advertisement