
కలిసుంటేనే కలిమి.. లక్ష గళాల సమైక్య హోరు
సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రం ఒక్కటిగా ఉంటేనే సాగునీటి సరఫరా సవ్యంగా సాగి మూడు ప్రాంతాలూ సస్యశ్యామలంగా ఉంటాయని నినదిస్తున్న సీమాంధ్ర ప్రజ.. రాష్ట్రం ముక్కలైతే విపరిణామాలే చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో బుధవారం జోరువానను సైతం లెక్కచేయకుండా ప్రజలు సమైక్యఉద్యమాన్ని హోరెత్తించారు. వరుసగా 43వ రోజూ లక్షలాదిమంది జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి గళార్చనలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు.. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని పోటెత్తించారు.
కొనసాగుతున్న ‘కృష్ణా’ బంద్
సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణోద్యంలో భాగంగా జేఏసీ పిలుపు మేరకు కృష్ణా జిల్లాలో 48 గంటల బంద్ బుధవారం విజయవంతమైంది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు మూతపడగా, థియేటర్లలో ప్రదర్శనలు రద్దుచేశారు. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. విజయవాడలో క్రేన్ ఆపరేటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్జీవోల ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారస్తులు రాస్తారోకో నిర్వహించారు. గురజాలలో ఉపాధ్యాయులు మానవహారంగా నిలబడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని చర్చి సెంటర్ వద్ద ఎన్‌జీఓలు, విద్యుత్ ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. చీరాల పట్టణ బంద్ విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సమైక్య పోరులో ఉపాధ్యాయుడు శంకరయ్య యాదవ్ మృతికి సంతాప సూచికంగా జిల్లావ్యాప్తంగా బంద్‌ను పాటించారు. వెంకటగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాలో జోరున వర్షం కురుస్తున్నా ఆందోళనకారులు పోరుబాట పట్టారు. ఆంధ్రాయూనివర్సిటీ ఉద్యోగులంతా పెన్‌డౌన్ చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర-ఒడిశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్‌లో గేట్లు మూయించి జలదిగ్బంధం చేపట్టారు.
విజయనగరం జిల్లాలో 48గంటల బంద్
ఉద్యోగ సంఘాల జేఏసీ 12వ తేదీ గురువారం అర్ధరాత్రి నుంచి 48 గంటలపాటు విజయనగరం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. తెర్లాంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అయిదుగంటల పాటు రోడ్డు దిగ్బంధించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్‌లోని 13 మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో మహిళా శక్తి సంఘాలకు చెందిన 5000 మంది మహిళలు ర్యాలీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో తెలంగాణ ఉద్యోగులకు సత్కారం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఎన్‌జీవోలు పల్లెయాత్ర చేపట్టారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆలూరులో క్రైస్తవులు ప్రత్యేక పార్థనలు చేశారు. చిత్తూరు జిల్లాలో 200 లారీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మదనపల్లెలో ఎన్‌జీవోలు వర్షం లో గొడుగులు పట్టుకుని నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు చీపుర్లతో వీధులను శుభ్రంచేసి నిరసన తెలి పారు. రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు శిరోముండనం చేయించుకున్నారు. రాజంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. అనంతపురం జిల్లాలో ప్రజలు వర్షం కురుస్తున్నా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎస్కేయూ జేఏసీ నేతలు జలదీక్ష చేశారు. రాయదుర్గంలో క్రైస్తవుల ర్యాలీలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
వీధి దీపాలకు సమైక్య సెగ
ప్రకాశం: సమైక్యాంధ్ర మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధి లైట్లను ఆలస్యంగా రాత్రి 9గంటలకు వెలిగించనున్నట్లు ఏపీ మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కే వెంకటేశ్వర్లు ఒంగోలులో తెలిపారు.
వ్యాన్ డ్రైవర్ ఆత్మహత్య
రాష్ట్ర విభజన ఆగబోదంటూ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన ప్రకటనను తట్టుకోలేక తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వల్లూరు శివారు అగ్రహారానికి చెందిన వ్యాన్ డ్రైవర్ గాది లోవరాజు(40) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రిటైర్డ్ హిందీ పండిట్ షేక్‌యూసుఫ్ హుసేన్(87) విభజన వార్తలను టీవీలో వీక్షిస్తూ కలత చెంది గుండెపోటుతో మరణించారు.
బొత్స క్యాంపు ఆఫీసుపై రాళ్ల దాడి
కాంగ్రెస్ నేతలపై కొనసాగుతున్న జనాగ్రహం
సాక్షి నెట్‌వర్క్ : కాంగ్రెస్ నేతలపై కొనసాగుతున్న జనాగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. విజయనగరం జిల్లా గరివిడిలోని పీసీసీ చీఫ్, మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంపై బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని సమైక్యవాదులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో క్యాంపుహౌస్ అద్దాలు పగిలిపోయాయి. విశాఖలో రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి కాన్వాయ్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు అడ్డంగా కూర్చుని ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఎంపీతో పాటు భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావులను తమ పదవులకు రాజీనామాలు చేయాలని నిలదీశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఉద్యోగులు ఘెరావ్ చేశారు. తన రాజీనామావల్ల ఏమీ కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఉద్యోగులు శాంతించలేదు.
మందకృష్ణ తీరుకు వ్యతిరేకంగా పలువురి రాజీనామా
అనంతపురం : సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కించపరుస్తున్నందుకు నిరసనగా పలువురు ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్‌ఎఫ్ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. సీమాంధ్ర మాదిగల రెక్కల కష్టంతో ఎదిగిన మందకృష్ణ.. ప్రస్తుతం తెలంగాణ వేర్పాటువాదులకు వంత పాడుతూ సీమాంధ్ర ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు.
‘లక్ష గళాల’ హోరు
సాక్షి నెట్‌వర్క్ : సీమాంధ్రలో బుధవారం పలుచోట్ల లక్ష గళార్చన కార్యక్రమాలను భారీగా నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లి లక్ష గళ గర్జనతో దద్దరిల్లింది. స్టీరింగ్ కమిటీ కన్వీనర్ దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన సభలో అన్ని వర్గాల వారూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ... పదవులు వీడని ప్రజాప్రతినిధులను రాజకీయంగా పాతరేయాల్సిన సమయం ఆసన్నమైందనిన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం పెళ్లి వుండపం వద్ద ‘శివగర్జన’ పేరిట ఉద్యవుభేరి మోగింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉగ్ర గోదావరి లక్ష జన గర్జన, తణుకులో జిల్లా కేబుల్ ఎంఎస్‌వోలు, ఆపరేటర్ల ఆధ్వర్యంలో లక్షగళార్చన, ఏలూరు, తాడేపల్లిగూడెంలో విద్యార్థి గర్జన నిర్వహించారు. వీటికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యూరు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు.