సెన్సెక్స్ 18 పాయింట్లు ప్లస్
ఎట్టకేలకు 8 రోజుల నష్టాలకు అడ్డుకట్ట పడింది. సెన్సెక్స్ 18 పాయింట్లు కూడగట్టుకుని 19,182 వద్ద ముగిసింది. అయితే రోజు మొత్తం హెచ్చుతగ్గులకు లోనైంది. గరిష్టంగా 19,306, కనిష్టంగా 19,141 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. గత 8 రోజుల్లో 1,138 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా స్వల్పంగా 7 పాయింట్లు బలపడి 5,685 వద్ద నిలిచింది. కాగా, బీఎస్‌ఈలో క్యాపిటల్ గూడ్స్ అత్యధికంగా 3.6% పతనంకాగా, మెటల్ ఇండెక్స్ 2.7% పుంజుకుంది. ఎఫ్‌ఐఐలు కేవలం రూ. 33 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 303 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్)లో కాంట్రాక్ట్‌ల సమస్య పరిష్కారానికి స్వతంత్ర కమిటీని వేయనున్న వార్తలతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 31% దూసుకెళ్లింది. రూ. 198 వద్ద ముగిసింది. కొత్త కాంట్రాక్ట్‌లను నిలిపివేసిన వార్తలతో గత రెండు రోజుల్లో ఈ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లలో లేని విధంగా జూలై నెలలో ప్రైవేట్ రంగ కార్యకలాపాలు మందగించినట్లు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వే పేర్కొనడంతో కొంతమేర సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఏడాది కనిష్టానికి భెల్
శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో విద్యుత్‌రంగ దిగ్గజం భెల్ ఏకంగా 19% పతనమైంది. ఏడాది కనిష్టమైన రూ. 121 వద్ద ముగిసింది. నికర లాభం సగానికి పడిపోగా, ఆర్డర్‌బుక్ సైతం బలహీనపడటంతో ఈ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి కంపెనీ మార్కెట్ విలువలో రూ. 6,976 కోట్లు ఆవిరైంది. మార్కెట్ క్యాప్ రూ. 29,591 కోట్లకు పరిమితమైంది. ఇక మిగిలిన దిగ్గజాలలో భారతీ, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ 2% స్థాయిలో క్షీణించగా, జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.7% జంప్ చేసింది. ఈ బాటలో స్టెరిలైట్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, హీరో మోటో, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ 4-2% మధ్య లాభపడ్డాయి.