బ్యాంకు షేర్లు జోరు.. ఆటో స్టాక్స్ ఢమాల్
Published Wed, Mar 29 2017 4:42 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM
మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు మార్కెట్లు పాజిటివ్గా ముగిశాయి. సెన్సెక్స్ 121.91 పాయింట్ల లాభంలో 29531.43 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల లాభంలో 9143.80 వద్ద క్లోజ్ అయ్యాయి. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల లాభాలతో మార్కెట్లు బుధవారం పాజిటివ్ గా ముగిశాయి. భారతీ ఎయిర్ టెల్ నేటి ట్రేడింగ్ లో టాప్ గెయినర్ గా 6 శాతం లాభాలు పండించింది. భారతీ ఎయిర్ టెల్ తో పాటు హిందాల్కో, టాటా పవర్, కోల్ ఇండియా, ఐటీసీ, విప్రో, హెచ్డీఎఫ్సీ, హిందూస్తాన్ యూనిలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, అంబుజా సిమెంట్స్ లాభాల్లో నడిచాయి.
రంగాల పరంగా చూసుకుంటే, బ్యాంకింగ్ సబ్-ఇండెక్స్ ఎన్ఎస్ఈ-నిఫ్టీ బ్యాంకు ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను చేధిస్తోంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, కొటక్ మహింద్రా లాభాలతో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 21,418.60ను బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ టచ్ చేసింది. అయితే బీఎస్-3 వాహనాల అమ్మకాలను 2017 ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తున్నట్టు సుప్రీంకోర్టు కీలకతీర్పు వెల్లడించడంతో ఎంపికచేసిన ఆటో షేర్లు కుప్పకూలాయి. హీరో మోటార్ కార్పొ, టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, మారుతీ సుజుకీ నష్టాలు పాలయ్యాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్, నిఫ్టీ సాధారణ స్థాయిల్లో నడిచాయి. 115 పాయింట్ల రేంజ్ లోనే సెన్సెక్స్ ట్రేడైంది. నిఫ్టీ గరిష్టంగా 9151, కనిష్టంగా 9109.10 స్థాయిల్లో నడించింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 14 పైసల లాభంతో 64.90 వద్ద ముగిసింది. బంగారం ధరలు ఎంసీఎక్స్ మార్కెట్లో 171 రూపాయలు పడిపోయి 28,677 వద్ద ట్రేడయ్యాయి.
Advertisement