రూపాయికి ఫివర్.. మార్కెట్లకూ దెబ్బ
Published Thu, Nov 24 2016 4:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
డెరివేటివ్ల సిరీస్ ముగింపు సెషన్లో 2013 ఆగస్టు తర్వాత మొదటిసారి దేశీయ మార్కెట్లు భారీ స్థాయిలో నష్టపోయాయి. సెన్సెక్స్ 191.64 పాయింట్లు నష్టపోయి 25,860.17 వద్ద, నిఫ్టీ 67.80 పాయింట్ల నష్టంతో 7965.50 పాయింట్ల వద్ద ముగిసింది. టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టాటా స్టీల్ గురువారం ట్రేడింగ్లో లాభాలనార్జించగా... టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, మహింద్రా అండ్ మహింద్రాలు నష్టాలు గడించాయి. గ్లోబల్ మార్కెట్లో అమెరికా కరెన్సీ డాలర్ పుంజుకోవడంతో గురువారం రూపాయి భారీ స్థాయిలో పడిపోయింది. నేటి ట్రేడింగ్లో 30 పైసలు నష్టపోయిన రూపాయి ఆల్ టైమ్ కనిష్టా స్థాయికి చేరింది.
దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి, భారీ ఎత్తున డాలర్ అమ్మకాలు చేపట్టడంతో రూపాయి కొంత కోలుకుని, 18 పైసల నష్టంతో 68.74వద్ద ముగిసింది. భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న అవుట్ఫ్లోస్తో రూపాయి విలువ భారీ స్థాయిలో పడిపోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో రూపాయి విలువ 70కి పడిపోయిన ఆశ్చర్యం లేదని పేర్కొంటున్నారు. ఇటు డాలర్ విలువ బలపడుతుండటంతో పాటు దేశీయంగా నోట్ల బ్యాన్ కొనసాగుతుండటంతో బంగారం ధరలు కూడా దిగొస్తున్నాయి. నేటి ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 106 రూపాయిల నష్టపోయి 28,723గా నమోదైంది.
Advertisement
Advertisement