పాలసీపై ఉత్కంఠ: లాభాలకు బ్రేక్
Published Tue, Feb 7 2017 4:01 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పాలసీ మీటింగ్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్లు వరుస లాభాలకు బ్రేకిచ్చాయి. నాలుగు వరుస సెషన్లో లాభపడ్డ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. 104.12 పాయింట్లు పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 28335.16 వద్ద, 32.75 పాయింట్ల నష్టపోయిన నిఫ్టీ 8768.30 వద్ద క్లోజ్ అయ్యాయి. డిసెంబర్ నెల ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్టంలో నమోదుకావడంతో ఆర్బీఐ బుధవారం ప్రకటించబోయే పాలసీ నిర్ణయంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మరోవైపు ఏప్రిల్లో జరుగబోయే పాలసీ సమీక్ష వరకు సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయద్దని వార్నింగ్లు కూడా వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లో ఎక్కువగా దేశీయ ఆటోమేకర్స్ బలహీన పడ్డాయి. నిఫ్టీ పడిపోవడంలో నాలిగింట మూడువంతులు ఇవే దోహదం చేశాయి. టాటామోటార్స్, మహింద్రా అండ్ మహింద్రాలు 2.5 శాతం మేర నష్టపోయాయి. ఆర్బీఐ ఈ సారి వడ్డీరేట్లను తగ్గిస్తుందని తాము భావించడం లేదని పీటర్సన్ సెక్యూరిటీస్ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ ట్రేడర్ సంగీత్ వి చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల వద్ద నిధులు సమృద్ధిగా ఉన్నాయన్నారు. అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలను విడుదల చేయడంతో బీహెచ్ఈఎల్ 5 శాతం దూసుకెళ్లింది. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ 0.20 పైసలు పడిపోయి 67.42 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 60 రూపాయల లాభంలో 29,253 వద్ద నమోదయ్యాయి.
Advertisement
Advertisement