మానవ మృగానికి నిలువెత్తు రూపం
న్యూఢిల్లీ: పైశాచికత్వానికి ప్రతిరూపం.. మానవ మృగానికి నిలువెత్తు రూపం రవీందర్ కుమార్. దేశరాజధానిలో వెలుగుచూసిన వరుస హత్యాచారాల కేసులో నిందితుడే ఇతడు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 30 మందిపైగా చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు రవీందర్ చెప్పాడని డిప్యూటీ పోలీసు కమిషనర్ విక్రంజిత్ సింగ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లోని కాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన రవీందర్ ఢిల్లీలో నివసిస్తూ ఐదేళ్ల కాలంలో ఈ కిరాతకాలకు ఒడిగట్టాడు. ఇంటరాగేషన్ లో భాగంగా ఢిల్లీ శివారు ప్రాంతాలైన నరెలా, బవానా, అలీపూర్ లకు అతడిని పోలీసులు తీసుకెళ్లారు. 24 ఏళ్ల రవీందర్ కుమార్ 2008 నుంచి నేరాలు ప్రారంభించినట్టు సింగ్ తెలిపారు.
దక్షిణ ఢిల్లీలోని బేగంపూర్ లో ఓ బాలుడిని అపహరించి హత్యాయత్నం చేసినందుకు గతేడాది అతడిని అరెస్ట్ చేశారు. అయితే బాలుడు ప్రాణాలతో బయటపడడంతో అతడిని వదిలేశారు. ఆరేళ్ల బాలికను అపహరించి, హత్య చేశారనే ఆరోపణలతో ఈనెల 16న అతడిని అరెస్ట్ చేశారు. అతడు బలితీసుకున్న చిన్నారుల సంఖ్య 40కు చేరొచ్చని పోలీసులు భావిస్తున్నారు.