
ఎన్సీపీ చీఫ్‌గా పవార్
ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రకటన
పట్నా: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడిగా మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ (74) తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ ఆరో జాతీయ సమావేశాల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి టీపీ పీతాంబర్ ప్రకటించారు. 1999లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి ఎన్సీపీని స్థాపించినప్పటి నుంచి పవారే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ 16వ వార్షికోత్సవాల సందర్భంగా బుధవారమిక్కడ నిర్వహించిన జాతీయ సమావేశాలకు పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గైర్హాజరవడం చర్చనీయాంశమైంది.
అజిత్ గైర్హాజరీపై నాయకులను ప్రశ్నించగా తమకు సమాచారం లేదని చెప్పారు. 700 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు. విదేశీ గడ్డపై దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ మోదీ భారత్ పరువు మంట గలుపుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కాషాయ ఎజెండాను, భావజాలాన్ని రుద్దుతున్నారంటూ నిప్పులు చెరిగారు.
దీన్ని పెను సవాల్‌గా స్వీకరించి ఎన్సీపీ అడ్డుకుంటుందన్నారు. మతవాద శక్తులకు అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవార్ హెచ్చరించారు. రానున్న బిహార్ ఎన్నికలు దేశ రాజకీయాలను నిర్దేశిస్తాయని, దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ప్రతి భారీ మార్పు బిహార్ నుంచే వస్తుందని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత సామరస్యం దెబ్బతినిందన్నారు.