
ఎగుమతుల్లో పెరగనున్న సేవల వాటా
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో భారత ఎగుమతుల్లో సేవల రంగం వాటా గణనీయంగా పెరగగలదని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. సర్వీసెస్ రంగానికి ప్రాధాన్యమిచ్చేలా కొత్త విదేశీ వాణిజ్య విధానంలో చేసిన మార్పులు ఇందుకు తోడ్పడగలవని వివరించాయి. 2013-14లో సేవల రంగం ఎగుమతులు 151.5 బిలియన్ డాలర్లు ఉండగా, ఇతరత్రా వస్తువుల ఎగుమతుల విలువ 314 బిలియన్ డాలర్లుగా నమోదైంది. తాజాగా రాబోయే ఐదేళ్లలో 900 బిలియన్ డాలర్ల స్థాయికి వస్తు, సేవల ఎగుమతులు పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలోనే సేవల రంగం వాటా గణనీయంగా పెరగగలదని భావిస్తున్నట్లు వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఎగుమతుల్లో వస్తువులు, సేవలు విభాగాలకు సంబంధించి నిర్దిష్ట లక్ష్యాలనేమీ పెట్టలేదని, రెండు విభాగాలు పరస్పరం పోటీపడాల్సి ఉంటుందని వివరించాయి.
సేవల రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం.. కొత్తగా ప్రకటించిన విదేశీ వాణిజ్య విధానంలో సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రం ఇండియా స్కీమ్ (ఎస్‌ఈఐఎస్) పథకం కింద పలు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. దీని కింద ఎగుమతిదారులకు డ్యూటీ స్క్రిప్ వంటి సర్టిఫికెట్లను అందిస్తుంది. వీటిని కస్టమ్స్, సర్వీసెస్, ఎక్సైజ్ మొదలైన సుంకాల చెల్లింపు కోసం ఉపయోగించుకోవచ్చు. విదేశీ పెట్టుబడుల పరంగాను, వాణిజ్యపరంగాను చూసినా సేవల రంగం చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. స్థూల దేశీయోత్పత్తిలో సేవల రంగం వాటా 58 శాతం కాగా, 28 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. వాణిజ్యంలో 25 శాతం వాటా, ఎగుమతుల్లో 35 శాతం వాటా ఉంది.