ఆమె వృద్ధురాలు.. ఆయన ఊసరవెళ్లి!
లక్నో: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియామకాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి తేలికచేసి పారేశారు. ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్‌ను తన సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ యూపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆమె పేర్కొన్నారు. 'కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె వృద్ధురాలు' అని విమర్శించారు. మాయావతి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. షీలా ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు దళితుల అభివృద్ధికి చేసేందేమీ లేదని దుయ్యబట్టారు.
ఇక యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాజ్ బబ్బర్ నియామకాన్ని కూడా ఆమె తోసిపుచ్చారు. తరచూ పార్టీలను మార్చే రాజ్ బబ్బర్ ఒక ఊసరవెళ్లిలాంటి వారని, ఆయనకు ఒక రాజకీయ పార్టీ మీదగానీ, రాజకీయ భావజాలంపైగానీ విశ్వాసం లేదని విమర్శించారు.