సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయనగరానికి బయల్దేరిన నవీన్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ బస్సును శివారులో నిలిపివేయడంతో ప్రయాణికులు బస్సు నుంచి దిగిపోయారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వివరాలు.. బుధవారం రాత్రి స్థానిక గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు నుంచి విజయనగరం జిల్లాకు బయల్దేరిన బస్సులో జాతీయ రహదారిపై హయత్‌నగర్ దాటాక వైర్లు కాలుతున్న వాసనలు వ్యాపించాయి. దీనిని గుర్తించిన ప్రయాణికులు కేకలు పెట్టడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపివేశాడు. అనంతరం, బస్సులో షార్ట్‌సర్క్యూట్ జరిగిన ప్రాంతాన్ని గుర్తించి ప్రమాదాన్ని నివారించాడు. ఈ ఘటన నేపథ్యంలో బస్సును నిలిపివేయడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ప్రయాణికురాలు జనప్రియ ‘సాక్షి’కి తెలిపారు. రాత్రి 11గంటలకు కూడా బస్సుకు మరమ్మతులు పూర్తికాలేదన్నారు.