సింగరేణి కాంట్రాక్టు కార్మికుల చర్చలు విఫలం
హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి, కాంట్రాక్టు కార్మికుల జేఏసీకి మధ్య బుధవారం రీజినల్ లేబర్‌కమిషన్ కార్యాలయంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చట్టబద్ధమైన హక్కుల కోసం కాంట్రాక్టు కార్మికుల జేఏసీ మంగళవారం సింగరేణి వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె పిలుపుతో యాజమాన్యం బుధవారం జేఏసీని చర్చలకు ఆహ్వానించింది. చర్చల్లో సింగరేణి డైరెక్టర్ పవిత్రన్ కుమార్, కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నేతలు పాల్గొన్నారు.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బోనస్, పీఎఫ్, హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని జేఏసీ నేతలు కోరగా, సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేస్తామని చర్చల్లో యాజమాన్యం తెలిపింది. సమస్యల పరిష్కరానికి నిర్ధిష్టమైన హామీలను యాజమాన్యం ఇవ్వకపోవడంతో సింగరేణి వ్యాప్తంగా సమ్మెను కొనసాగించాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. చర్చల్లో బీఎంఎస్ నాయకుడు పులి రాజిరెడ్డి, ఏఐటీయూసీ నాయకుడు సత్యనారాయణ, ఐఎఫ్‌టీయూ శంకర్, వెంకన్న, సీఐటీయూ మధు, ఐఎఫ్‌టీయూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర కార్యదర్శి యాకుబ్‌షావళి తదితరులు పాల్గొన్నారు.