సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె సైరన్
హైదరాబాద్: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధనకు జరిపిన చర్చల్లో యాజమాన్యం పాల్గొనకపోవడంతో సింగరేణి కాంట్రాక్టు జేఏసీ నేతలు బుధ వారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. మంగళవారం రీజనల్ లేబర్ కమిషన్ కార్యాలయంలో సింగరేణి కాంట్రాక్టు జేఏసీకి, యాజమాన్యానికి జరగాల్సిన చర్చల్లో యాజమాన్యం పాల్గొనలేదు. సింగరేణి వ్యాప్తంగా 26 వేల మంది కాం ట్రాక్టు కార్మికులకు పీఎఫ్, బోనస్, హైపవర్ వేతనాలు యాజమాన్యం అమలు చేయట్లేదని జేఏసీ నేత సాదినేని వేంకటేశ్వరరావు పేర్కొన్నారు.
యాజమాన్యం వైఖరికి నిరసనగా ఫిబ్రవరిలోనే సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహ రించటం సరికాదన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కార్మికులందరూ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు జేఏసీ నేతలు బీఎంస్ రాజిరెడ్డి, సీఐటీయూ మధు, ఏఐటీయూసీ సత్యనారాయణ, దాసు, ఐఎఫ్‌టీయూ శంకర్, వెంకన్న, బీఎంఎస్ రాజు, ఉపేందర్ పాల్గొన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తలపెట్టిన సమ్మెకు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు.
వారసత్వ ఉద్యోగాలపై ముగిసిన వాదనలు
- ‘సింగరేణి’పై తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వా లన్న ప్రభుత్వ నిర్ణయంపై దాఖలైన వ్యాజ్యంలో మంగళవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన కె.సతీశ్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, అనారోగ్య కారణాలతో వైదొలిగే ఉద్యోగుల వారసులకు అవకాశాలు కల్పిస్తే ఇబ్బంది లేదని కోర్టుకు విన్నవించారు. అయితే వారసత్వ ఉద్యోగాల భర్తీకి అనారోగ్యాన్ని సాకుగా వాడుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షల మంది నిరుద్యోగ యువత నష్టపోతుందన్నారు. తరువాత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, బొగ్గు గని కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారి వారసులకు ఉద్యోగాలిస్తున్నామన్నారు. వైద్యపరంగా అనర్హులై విధులను నిర్వర్తించలేని వారి వారసుల కోసం ఈ నియామకాలు చేపట్టామన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పథకం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదని, 1981 నుంచి అమల్లో ఉందని తెలిపారు. 30 వేల వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు పిటిషనర్ చెబుతున్నారని, అది అవాస్తవమని, కేవలం 5వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నామన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.