ఉంగరమండీ.. మహిమ గల ఉంగరం!
వెనుక జేబులో పర్సు.. అందులో బోలెడన్ని కార్డులు. ముందు జేబులో ఇంటి తాళంచెవితోపాటు ఆఫీసుకు సంబంధించినవి మరికొన్ని కీస్! ఆఫీసులో పీసీ ఆన్ చేసేందుకు ఓ పాస్‌వర్డ్, కారు డోర్ తెరిచేందుకు, ఆన్ చేసేందుకు ఇంకో తాళం చెవి వీటికి అదనం. క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు పాస్‌వర్డ్‌ల సంగతి సరేసరి.. ఈ కాలంలో ఆఫీసుకెళ్లే వారందరి వద్ద ఇవి కామన్. ఇలా ఒక్కో పనికి ఒక్కోటి కాకుండా... అన్నింటికీ ఒకటే గాడ్జెట్ ఏదైనా ఉంటే? అబ్బో.. రోజూ బోలెడంత స్ట్రెస్ తగ్గిపోతుందంటున్నారా? అయితే ఫొటోలో ఉన్న ఉంగరం మీ కోసమే!
తాళం చేతులు, క్రెడిట్, డెబిట్, మెంబర్‌షిప్పు కార్డుల వివరాలు మోసుకెళ్లడం నుంచి గాడ్జెట్ల పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం వరకూ అన్ని పనులూ ఈ ఉంగరమే చక్కబెట్టేస్తుంది. ఇంకో విషయం.. ఇది పనిచేయాలంటే మన స్మార్ట్‌ఫోన్ దగ్గరుండాల్సిన అవసరమూ లేదు. ఒకసారి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా మన వివరాలన్నింటినీ నమోదు చేసుకుంటే చాలు... ఆ తరువాత అన్ని ఇదే చూసుకుంటుంది. టోకెన్‌ను కొనుక్కున్న తరువాత ఒక్కసారి మన వేలిముద్రను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తాళమున్న చోట ఈ ఉంగరాన్ని చూపిస్తే తలుపు తెరుచుకుంటుంది.. రెండుసార్లు చిన్నగా నొక్కితే కంప్యూటర్ / ల్యాప్‌టాప్ అన్‌లాక్ అయిపోతుంది. షాపింగ్ తరువాత స్వైపింగ్ చేసే పని లేకుండా ఓ రిసీవర్‌పై మన చేయి ఉంచితే చాలు. సెకన్లలో మన బ్యాంకు నుంచి బిల్లులు జమైపోతాయి.
బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు రెండింటితో ఇవన్నీ అలా అలా జరిగిపోతాయన్నమాట. ఒకవేళ చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని ఎవరైనా తొలగిస్తే.. ఆ విషయాన్ని వెంటనే గుర్తించేందుకు ఇందులో ఓ ఆప్టికల్ సెన్సర్ కూడా ఉంది. ఒకసారి ఉంగరం వేలినుంచి తీయడం ఆలస్యం.. మన వివరాలన్నీ ప్రత్యేకమైన కోడ్ భాషలోకి మారిపోతాయి. దీంతో మన సమాచారం భద్రంగా ఉంటుందన్నమాట. ఇంకో ఏడాదిలోపు ఈ హైటెక్ ఉంగరాన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తామని అంటోంది దీన్ని తయారు చేసిన అమెరికన్ కంపెనీ టోకనైజ్.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్