స్మిత్.. నీ తీరు సరికాదు!
బెంగళూరు టెస్టులో డీఆర్‌ఎస్ రివ్యూ కోసం డ్రెసింగ్ రూమ్‌కు సైగలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీరును భారత సీనియర్ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ తీవ్రంగా తప్పుబట్టారు. రెండో టెస్టులో ఉమేశ్ బౌలింగ్‌లో స్మిత్‌ను అంపైర్ నైజెల్ లాంగ్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా.. రివ్యూ చేయాలని భావించిన స్మిత్ ముందుగా సహచరుడు హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించాడు. అయినా సందేహం తీరక ఏంటి అన్నట్లుగా చేతులతో డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. దీనిని గుర్తించిన కోహ్లి వెంటనే దూసుకొచ్చి అలా ఎలా చేస్తావంటూ స్మిత్‌తో వాదించాడు. ఇది తప్పంటూ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అప్పటికే స్మిత్‌ను కూడా హెచ్చరించిన అంపైర్, కోహ్లిని కూడా పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
ఈ వివాదంపై గవాస్కర్ స్పందిస్తూ.. స్మిత్ తీరు క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శించాడు. 'కామెంటరీ బాక్స్‌లో ఉన్న చాలామంది ఈ వివాదం గురించి స్పందించారు. డీఆర్‌ఎస్ రివ్యూ కోరాలా? వద్దా? అనే దానిపై ఆస్ట్రేలియన్లు డ్రెసింగ్ రూమ్ వైపు సైగలు చేస్తున్నారు. అక్కడ ఉన్న తమ కంప్యూటర్ నిపుణుడి సూచనలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది దారుణం. హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించిన తర్వాత కూడా స్మిత్ నిపుణుడి సైగల కోసం డ్రెసింగ్ రూమ్ వైపు చూశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దీనిపై ఐసీసీ, మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి' అని గవాస్కర్ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రా సైతం స్మిత్ తీరును తప్పుబట్టారు. రివ్యూ తీసుకోవాలా? వద్దా? అనేదానిపై డ్రెసింగ్ రూమ్ నుంచి సైగలు ద్వారా సూచనలు తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని లక్ష్మణ్ ట్వీట్ చేయగా, ఇది మోసం చేయడమేనని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు.