బుల్లెట్ ట్రైన్ లో పాము కలకలం
టోక్యో: జపాన్ లో కదులుతున్న బుల్లెట్ ట్రైన్(నోజోమీ 103) లో సోమవారం ఓ పాము కలకలం సృష్టించింది. దీంతో దేశ రాజధాని టోక్యో నుంచి హిరోషిమాకు బయల్దేరిన ఆ రైలును అధికారులు అర్ధాంతరంగా నిలిపివేశారు. జపాన్ రైల్వేశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రైన్ లోని సీట్ల మధ్య ఉన్న ఖాళీలో పాము తిరగడం గమనించిన ఓ ప్రయాణికుడు సమాచారం అందించినట్లు చెప్పారు.
దీంతో వెంటనే రైలును నిలిపివేసి పాముని పట్టుకున్నట్లు వెల్లడించారు. ముదురు గోధుమ రంగులో ఉన్న పాము విషపూరితమైనది కాదని చెప్పారు. ప్రయాణీకులకు ఎవరికీ అసౌకర్యం కలగకుండా సాధారణ సమయానికే రైలు హిరోషిమాకు చేరుకుందని పేర్కొన్నారు. అధికారుల ఆధీనంలో ఉన్న పామును ఎవరైన ప్రయాణీకులు తమ వెంట తెచ్చుకున్నారా? అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు చెప్పారు.
పాము తమదేనని ఇప్పటివరకూ ఎవరూ అధికారులను సంప్రదించలేదని వెల్లడించారు. కాగా, ఐదేళ్ల క్రితం కూడా బుల్లెట్ రైలులో పాము కనిపించడంతో రైలును నిలిపివేశారు. అప్పటి నుంచి చిన్నపాటి పక్షులు, చేపలను తప్ప మిగతా వాటితో రైళ్లలో ప్రయాణించడాన్ని జపాన్ ప్రభుత్వం నిషేధించింది. జపాన్ బుల్లెట్ రైళ్లు సమయానికి గమ్యాన్ని చేరుకోవడంలో ప్రపంచంలోనే ముందున్నాయి.