రుణం కోసం బతికున్న తండ్రిని ‘చంపేసి’ ..!
సాక్షి, సిటీబ్యూరో: తండ్రి ఆస్తిపై రుణం తీసుకోవడానికి ఓ సుపుత్రుడు భారీ స్కెచ్ వేశాడు. బతికున్న తండ్రి చనిపోయినట్లు పత్రాలు సృష్టించడంతో పాటు స్నేహితుడిని స్థిరాస్తిని విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు. వీరిద్దరితో పాటు మరో ఆరుగురితో కలిసి కథ నడిపి ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించకపోవడం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు.
సికింద్రాబాద్‌లోని కాకగూడ వాసవీనగర్‌కు చెందిన కె.వెంకటేశ్వరరావు కొన్నాళ్ళుగా మస్కట్‌లో ఉంటున్నారు. ఆయన కొడుకు కె.సుధాకర్ ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. కాకగూడలో తండ్రి ఇంటిపై కన్నేసిన సుధాకర్ దాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని భావించాడు. దీనికోసం తన స్నేహితుడైన వరప్రసాద్‌తో పాటు రాజ్యలక్ష్మి, కిరణ్, వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కనకాంబరరావు, నాగేంద్రలతో కలిసి పథకం రచించాడు. ఇందులో భాగంగా తండ్రి వెంకటేశ్వరరావు చనిపోయినట్లు ఓ మరణ ధ్రువీకరణ పత్రాన్ని తయారుచేశారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డ్ దీన్ని జారీ చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించాడు. దీంతోపాటు ఇతర పత్రాలను సృష్టించిన సుధాకర్ వాసవీనగర్‌లో ఉన్న ఇంటిని తన స్నేహితుడు వరప్రసాద్‌కు విక్రయిుస్తున్నట్లు సేల్‌డీడ్ రూపొందించాడు.
వీటి ఆధారంగా అంతా కలిసి మాగ్న ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించడంలో విఫలం కావడం.. కంపెనీ ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కంపెనీ ప్రతినిధులు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీలు జోగయ్య, కె. రామ్‌కుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ బి. రవీందర్‌రెడ్డి గురువారం సుధాకర్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.