అమెరికాకు వెళ్లిన సోనియా గాంధీ!
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం మధ్యాహ్నం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఎనిమిది రోజుల తర్వాత భారత్ కు తిరిగి వస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. సోనియా గాంధీ వెంట కూతురు ప్రియాంక వాద్రా ఉన్నారు.
ఆరు నెలలకు ఒకసారి జరిగే వైద్య పరీక్షల కోసం సోనియా అమెరికా వెళ్లారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది తెలిపారు. వాస్తవానికి సోనియా గత సంవత్సరం సెప్టెంబర్ లోనే వెళ్లాల్సి ఉంది అని.. అయితే కొన్ని కీలక సమావేశాల కారణంగా వాయిదా పడిందని ద్వివేది వెల్లడించారు. మళ్లీ వారం రోజుల తర్వాత భారత్ కు తిరిగి వస్తారన్నారు. ఆహర భద్రత బిల్లు చర్చ సందర్భంగా లోకసభలో సోనియాగాంధీ ఇటీవల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.