
అక్కడ ఆకలితో అలమటిస్తున్న ప్రజలు
సూడాన్‌లో దాదాపు 48 లక్షల మంది ప్రజలు ఆకలిమంటలతో అలమటిస్తున్నారని ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్’ సూడాన్ డెరెక్టర్ జాయిస్ కన్యాంగ్వా లూమా తెలిపారు.
జుబా: అంతర్యుద్ధంతో రగిలిపోతున్న దక్షిణ సూడాన్‌లో దాదాపు 48 లక్షల మంది ప్రజలు ఆకలిమంటలతో అలమటిస్తున్నారని ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్’ సూడాన్ డెరెక్టర్ జాయిస్ కన్యాంగ్వా లూమా తెలిపారు. ముఖ్యంగా దక్షిణ సూడాన్‌లోని ఉత్తర ప్రాంతంలోవున్న బహర్ ఎల్ ఘజల్ ఆహార కొరత సమస్య మరీ తీవ్రంగా ఉందని, అక్కడ ప్రతి పది మందిలో ఆరుగురు ఆకలితో అలమటిస్తున్నారని, ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని లూమా తెలిపారు.
ముందుగా ఆ ప్రాంతంలోని 8,40,000 మంది ప్రజలకు ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం కింద ఆహారాన్ని విమానాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించామని లూమా చెప్పారు. ప్రభుత్వ దళాలకు, మాచర్ దళాలకు మధ్య అంతర్యుద్ధం తిరిగి జూలై నెలలో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం బహర్ ఎల్ ఘజల్ ప్రాంతంలో అసాధారణ నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోందని చెప్పారు.
అంతర్యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటాయని, కాలం కలసిరాక ప్రజల కొనుగోలు శక్తి కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని లూమా చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎల్ ఘజల్ ప్రాంతానికి సరకులను వ్యాపారులు తరలించినా కొనే పరిస్థితి అక్కడి ప్రజలకు లేదని అన్నారు.