
ఆన్ లైనా.. ఆఫ్ లైనా?
శాన్ జోసె: సాంకేతికత అంటే తన దృష్టితో సాధికారత అని... ఇది ఆశకు, అవకాశానికి మధ్య వారధిలా పనిచేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెక్నాలజీతో అభివృద్ధి సాధ్యమని ఆయన పునురుద్ఘాటించారు. కాలిఫోర్నియాలో శాన్ జోసెలో 'డిజిటల్ ఇండియా'లో భాగంగా ఐటీ దిగ్గజ సంస్థల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంచాలని అభిప్రాయపడ్డారు. ఐటీతో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. మీరు నిద్రపోతున్నారా, మెలకువగా ఉన్నారా అనేది పోయి ఆన్ లైన్ లో ఉన్నారా, ఆఫ్ లైన్ లో ఉన్నారా అనే ట్రెండ్ వచ్చిందని చమత్కరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
* ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం.
* మేము అధికారంలోకి రాగానే పేదరికాన్ని నిర్మూలించేందుకు టెక్నాలజీ సాయంతో యుద్ధం చేస్తున్నాం
* సోషల్ మీడియాతో సామాజిక ప్రతిబంధకాలు తగ్గాయి
* ట్విటర్ ప్రతి ఒక్కరినీ రిపోర్టర్ గా మార్చేసింది
* ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ మనకు ఇప్పుడు కొత్త మిత్రులు
* గూగుల్, ట్విటర్ ప్రపంచాన్ని మార్చేశాయి
* గూగుల్ సహకారంతో భారత్ లో 500 రైల్వే స్టేషన్లలో వై-ఫై సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం
* పాఠశాలలు, కాలేజీలు బ్రాడ్ బ్యాండ్ తో అనుసంధానిస్తాం
* 125 కోట్ల మందిని డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించాలని భావిస్తున్నాం
* అందరికీ డిజిటల్ లిటరసీ అవసరం
* ఐటీతో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం
* నా మొబైల్ యాప్ MyGov.inతో ప్రజలకు దగ్గరగా ఉన్నా
* టెక్నాలజీతో ప్రజలకు పరిపాలన చేరువ చేస్తాం
* స్థానిక భాషల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి
* ఐటీ దిగ్గజ కంపెనీలు డిజిటల్ ఇండియాలో భాగస్వాములు కావాలి