బ్రోకింగ్ సంస్థలకు గడ్డుకాలం.. !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు ఇండియాలో ట్రేడర్లు స్టాక్ మార్కెట్ పేరు చెపితేనే.. ఆమడ దూరం పరుగులు పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయికి కూతవేటు దూరంలో ఉన్నా రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం దూరంగానే ఉంటున్నారు. దీంతో వ్యాపారం లేక కొన్ని బ్రోకింగ్ సంస్థలు దుకాణాలను మూసుకుంటుంటే మరికొన్ని సంస్థలు ఇతర ఆదాయాలపై దృష్టిసారిస్తున్నాయి. ఇప్పటికే హెచ్‌ఎస్‌బీసీ, బ్రిక్ సెక్యూరిటీస్ రిటైల్ బ్రోకింగ్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించగా క్యాపిటల్ ఫస్ట్ కూడా అదే దారిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని పెద్ద సంస్థలు మాత్రం వ్యాపార విస్తరణకు పూర్తిగా స్వస్తి చెప్పడమే కాకుండా సిబ్బంది సంఖ్యను బాగా తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రోకింగ్ వ్యాపారం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని కార్వీ గ్రూపు చైర్మన్ సి.పార్థసారథి తెలిపారు. దీంతో గత కొంతకాలంగా సిబ్బంది సంఖ్యను కుదించినట్లు తెలిపారు. ‘‘2000 సంవత్సరం ప్రారంభంలో ఇండియాలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య రెండు కోట్లపైన ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 75 లక్షలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థేనని, ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే తిరిగి పుంజుకుంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఆచితూచి అడుగులు వేస్తున్నామని’’ జెన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు.
మార్జిన్లపై ఒత్తిడి..: స్టాక్ మార్కెట్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటుండటంతో బ్రోకింగ్ కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. ఇండియా ఇన్ఫోలైన్ ఈ ఏడాది తొలి త్రైమాసికం బ్రోకింగ్ ఆదాయం.. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15% క్షీణించి రూ.128 కోట్లకు పడిపోయింది. బ్రోకింగ్ సంస్థలకు అధికాదాయం వచ్చే క్యాష్ సెగ్మెంట్‌లో లావాదేవీలు తగ్గి ట్రేడింగ్ పరిమాణం బాగా పెరగడం కూడా మార్జిన్లపై ఒత్తిడిని పెంచుతోంది. ప్రస్తుత స్టాక్ మార్కెట్లో నమోదవుతున్న టర్నోవర్‌లో 90% ట్రేడింగ్ వాటా ఉంటే క్యాష్ సెగ్మెంట్ 10%కి పడిపోయింది. అలాగే కంపెనీల మధ్య పోటీ పెరగడంతో సగటు ట్రేడింగ్ మార్జిన్ విలువ గత మూడేల్లో 17 బేసిస్ పాయింట్ల నుంచి 10 బేసిస్ పాయింట్లకు పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో సగటు లావాదేవీపై బ్రోకింగ్ సంస్థకు 7-8 డాలర్లు ఆదాయంగా వస్తుంటే, ఇక్కడ ఇది అర డాలర్‌కు మించకపోవడం కూడా హెచ్‌ఎస్‌బీసీ వంటి విదేశీ సంస్థలు ఈ వ్యాపారం నుంచి వైదొలగడానికి ఒక కారణమనేది మార్కెట్ వర్గాల వాదన.
ఎన్‌బీఎఫ్‌సీలవైపు చూపు
బ్రోకింగ్ వ్యాపారం దెబ్బతినడంతో ఆదాయం కోసం ఇతర వ్యాపారాలపై బ్రోకింగ్ సంస్థలు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. 2007లో మొత్తం వ్యాపారంలో 80% బ్రోకింగ్ నుంచే వస్తే ఇప్పుడది 20-30%కి పడిపోయినట్లు ఈ కంపెనీల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు ఈ సంస్థలన్నీ రుణాలు, ఫీజు ఆధారిత ఇతర వ్యాపారాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఇండియా ఇన్ఫోలైన్ ఇచ్చిన రుణాల విలువ 29% పెరిగి రూ.9,463 కోట్లకు చేరుకుంటే, ఎడల్వీస్ రుణాలు 30% పెరిగి రూ.6,623 కోట్లకు పెరిగాయి. మన రాష్ట్రానికి చెందిన కార్వీ సంస్థ ఎన్‌బీఎఫ్‌సీతో పాటు ఈ మధ్యనే బీమా రిపాజిటరీ సర్వీసుల్లోకి ప్రవేశించగా, జెన్ సెక్యూరిటీస్ కూడా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది.