ఆటో, సిమెంట్ షేర్లపై దృష్టి
వివిధ అంశాల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: వివిధ అంశాల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. శుక్రవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ జూన్ క్వార్టర్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపారు. దీంతోపాటు డాలరుతో రూపాయి మారకం, విదేశీ పెట్టుబడుల వంటివి కూడా ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2013-14)తొలి క్వార్టర్‌కు జీడీపీ 5.4% నుంచి 4.4%కు తగ్గిన సంగతి తెలిసిందే. త్రైమాసిక ప్రాతిపదికన గత నాలుగేళ్లలో ఇదే కనిష్ట వృద్ధి. కాగా, ఆగస్ట్ నెలకు అమ్మకాల గణాంకాలు వెలువడనుంటంతో ఈ వారం మొదట్లో ఇన్వెస్టర్లు ఆటో, సిమెంట్ రంగాల షేర్లపై దృష్టిపెడతారని నిపుణులు పేర్కొన్నారు.
ముగింపు సానుకూలమే
గడచిన వారం చివరిరోజు(శుక్రవారం) ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ గరిష్టస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ చివరకు 5,450 పాయింట్లపైన స్థిరపడటం ద్వారా సానుకూలంగా ముగిసిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఈ బాటలో మరికొద్ది రోజులు 5,500 పాయింట్లకు ఎగువన కొనసాగితే ర్యాలీ మరింత బలపడుతుందని చెప్పారు. వారం రోజుల చార్టుల ప్రకారం కాండిల్ స్టిక్ నిర్మాణం బుల్లిష్ సంకేతాలను ఇస్తున్నదని విశ్లేషించారు. నిఫ్టీ 5,530 స్థాయిని అధిగమిస్తేనే ఈ విషయం రూఢి అవుతుందని తెలిపారు.
బలపడిన రూపాయి
కరెన్సీ పతనాన్ని నిలువరించడంతోపాటు, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటామని పార్లమెంట్‌లో ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీలతో గత వారం చివర్లో రూపాయి భారీగా పుంజుకుంది. డాలరుతో మారకంలో వరుసగా రెండో రోజు లాభపడటం ద్వారా 65.70 వద్ద ముగిసింది. అంతకు రెండు రోజుల ముందు రికార్డు సృష్టిస్తూ 68.80 వద్ద కొత్త కనిష్ట స్థాయిని తాకిన విషయం విదితమే. రూపాయి అనూహ్య పతనం షాక్ ఇచ్చిందని, అయితే దీనిని అడ్డుకునేందుకు క్యాపిటల్ కంట్రోళ్ల వంటివి విధించ బోమని ప్రధాని స్పష్టం చేశారు. సంస్కరణల మార్గంనుంచి తిరోగమించమని, ఇతర విధాన చర్యలను చేపడతామని హామీ ఇవ్వడంతో స్టాక్ మార్కెట్లు కూడా బలపడ్డాయి. రూపాయి విలువ క్షీణించడం కొంతవరకూ ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని, ఎగుమతుల విషయంలో పోటీ పడగలగడంతోపాటు, దిగుమతులను తగ్గించుకుంటామని వ్యాఖ్యానించారు.
ర ఘురామ్ రాజన్‌పై చూపు
ఈ నెల 5న(గురువారం) రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న రఘురామ్ రాజన్‌పై మార్కెట్లు దృష్టి నిలుపుతాయని నిపుణులు పేర్కొన్నారు. కొత్త గవర్నర్‌గా తాజా చర్యలకు అవకాశముంటుందని మార్కెట్లు ఆశిస్తున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం, లిక్విడిటీ తదితర అంశాల ప్రాతిపదికగా ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కొంతకాలంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్నారు. కాగా, మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్ ధరలను హెచ్చించగా, డీజిల్ ధరలను సైతం పెంచే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గత వారం సిరియాపై సైనిక దాడికి బ్రిటిష్ పార్లమెంట్ వ్యతిరేకతను వ్యక్తం చే యడంతో ముడిచమురు ధరలు కొంతమేర చల్లబడినప్పటికీ, మరోసారి బలపడే అవకాశమున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిసెంబర్‌కల్లా రూపాయి బలపడుతుంది!
న్యూఢిల్లీ: డాలరుతో మారకంలో రూపాయి విలువ డిసెంబర్‌కల్లా పుంజుకుంటుందని స్టాన్‌చార్ట్ అంచనా వేసింది. కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అయితే స్వల్పకాలంలో అంటే ఈ నెలాఖరుకల్లా రూపాయి మరోసారి బలహీనపడి 68 మార్క్‌ను చేరుకుంటుందని తాజా నివేదికలో అభిప్రాయపడింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీల నిలిపివేతపై ఆందోళనలు, అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం, మధ్యప్రాచ్యంలో ఆందోళనల నేపథ్యంలో పెరుగుతున్న ఆయిల్ ధరలు వంటి అంశాలు రూపాయిని దెబ్బకొట్టొచ్చని పేర్కొంది. ఆగస్ట్ 28న రూపాయి చరిత్రలో తొలిసారి 68.80ను తాకిన సంగతి తెలిసిందే. అయితే ఆపై ప్రధాని మన్మోహన్ హామీలతో కొంత పుంజుకుని 66 వద్ద స్థిరపడింది.
ఆగస్ట్‌లో రూ. 16,000 కోట్లు వెనక్కి
న్యూఢిల్లీ: దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఆగస్ట్ నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దాదాపు రూ. 16,000 కోట్ల(250 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డాలరుతో మారకంలో రూపాయి భారీ పతనం, క్యాపిటల్ కంట్రోళ్ల ఆందోళనలు వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి. కాగా, వీటిలో డెట్ మార్కెట్ల నుంచి రూ. 9,773 కోట్లు(155 కోట్ల డాలర్లు), ఈక్విటీల నుంచి రూ. 5,922 కోట్లు(90.2 కోట్ల డాలర్లు) చొప్పున నికర అమ్మకాలు నిర్వహించారు. సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. ఇక ఈ బాటలో ఎఫ్‌ఐఐలు జూలైలో రూ. 17,000 కోట్లు, జూన్‌లో రూ. 44,162 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.