సీఎంగా శశికళ ప్రమాణాన్ని అడ్డుకోండి
- సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు శశికళ కూడా నిందితురాలుగా ఉన్నారని, ఈ కేసులో వారంలోగా తీర్పు రానున్న నేపథ్యంలో అంతవరకు ఆమె సీఎంగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై వారంలోగా తీర్పు వెలువరించే అవకాశముందని సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చిన వెంటనే.. సత్తా పంచాయత్ ల్యాకం స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అయిన సెంథిల్ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు వాదనలు వినే అవకాశముంది.
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళా నటరాజన్ కూడా సహ నిందితురాలు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో తీర్పు మరో వారం రోజుల్లో వెలువడే అవకాశముంది. ప్రత్యేక కోర్టు ఈ కేసులో జయలలిత, శశికళలను దోషులుగా నిర్ధారించగా, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి.. ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ కేసులోనే ఇప్పుడు త్వరలో తీర్పు వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన సమయంలో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు శశికళ మంగళవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది. ఆ తీర్పు గనక శశికళకు వ్యతిరేకంగా ఉండి, ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తే మాత్రం ఆమె సైతం తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.