శశికళ పదవికి సుప్రీం తీర్పు గండం?
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళా నటరాజన్ కూడా సహ నిందితురాలు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో తీర్పు మరో వారం రోజుల్లో వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు ఈ కేసులో జయలలిత, శశికళలను దోషులుగా నిర్ధారించగా, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి.. ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ కేసులోనే ఇప్పుడు త్వరలో తీర్పు వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన సమయంలో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈనెల తొమ్మిదో తేదీన శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది. ఆ తీర్పు గనక శశికళకు వ్యతిరేకంగా ఉండి, ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తే మాత్రం ఆమె సైతం తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆమె చేపట్టే పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయి, మరోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం తెరమీదకు వచ్చే అవకాశాలు లేకపోలేవని అంటున్నారు.