శశికళకు కారాగారమా? అధికారమా? | Supreme Court verdict on Sasikala disproportionate assets case on Tuesday | Sakshi
Sakshi News home page

శశికళకు కారాగారమా? అధికారమా?

Published Tue, Feb 14 2017 1:53 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

Supreme Court verdict on Sasikala disproportionate assets case on Tuesday

శశికళ భవితవ్యంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ రాజకీయ భవిష్యత్తుపై సుప్రీంకోర్టు మంగళవారం ‘తీర్పు’ ఇవ్వనుంది. తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని.. 20 ఏళ్ల నాటి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇవ్వబోయే ఈ తీర్పు మరో మలుపు తిప్పనుంది. జయలలిత 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మించి రూ. 66 కోట్లకు పైగా ఆస్తులు సమీకరించుకున్నారనేది అసలు కేసు. ఇందులో జయలలితతో పాటు.. ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బందువులు ఇళవరశి, వి.ఎన్‌.సుధాకరన్‌లు కూడా నిందితులుగా ఉన్నారు. ఆ కేసు పూర్వాపరాలివీ...

* 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి, డీఎంకే అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది జూన్‌ 14న సుబ్రమణ్యం స్వామి (ప్రస్తుతం బీజేపీ ఎంపీ) జయలలితపై ఫిర్యాదు చేశారు. డీఎంకే ప్రభుత్వం జయలలితపై కేసు నమోదు చేసింది. ఏడాది తర్వాత జయలలిత, శశికళ, ఇళవరశి, సుధాకరన్‌లపై ప్రత్యేక కోర్టు చార్జిషీటు నమోదు చేశారు.

* జయలలితకు చెందిన చెన్నైలోని ఫామ్‌హౌస్‌లు, బంగళాలు, తమిళనాడులో వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో ఒక ఫామ్‌హౌస్‌, నీలగరి కొండల్లో ఒక టీ ఎస్టేట్‌, విలువైన ఆభరణాలు, పారిశ్రామిక షెడ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, పెట్టుబడులు, లగ్జరీ కార్ల శ్రేణి తదితర ఆస్తులు ఈ కేసు పరిధిలో ఉన్నాయి.

* 1997లో జయలలిత నివాసంలో సోదాలు జరిపి 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 జతల చెప్పులు, 10,500 చీరలు, 91 వాచీలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని చెన్నైలోని రిజర్వు బ్యాంకు వాల్ట్‌ లో ఉంచారు. 2014లో వీటిని బెంగళూరుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు.

* 2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయి అన్నా డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో.. కేసు విచారణను తమిళనాడు వెలుపలకు బదిలీ చేయాలని 2003లో సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

* 2014 సెప్టెంబర్‌ 27న తీర్పు చెప్పిన కర్ణాటక ప్రత్యేక కోర్టు.. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఇ, 13(2) సెక్షన్ల కింద జయలలితను దోషిగా ప్రకటించింది. శశికళ, మిగతా ఇద్దరిని ఐపీసీలోని 120బి, 109 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించింది. నలుగురికీ నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జయలలితపై రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురిపై తలా రూ. 10 కోట్ల చొప్పున జరిమానా కూడా విధించింది.

* ఆ తీర్పు వచ్చేటప్పటికి జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని దోషిగా నిర్ధారించి, జైలు శిక్ష వేయడం ఇదే తొలిసారి. ఈ తీర్పు ఫలితంగా జయ.. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికీ అనర్హురాలయ్యారు. ఆ పదవులు కోల్పోయారు. కోర్టుకు హాజరైన జయలలితను తీర్పు వెలువడిన వెంటనే పారప్పణ అగ్రహార జైలుకు తరలించారు. శశికళ సహా మిగతా ముగ్గురినీ ఇతర జైళ్లకు పంపారు.

* ప్రత్యేక కోర్టు తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసిన జయ తదితరులు.. బెయిల్‌ కోసం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2014 అక్టోబర్‌ 17వ తేదీన సుప్రీంకోర్టు నలుగురికీ బెయిల్‌ మంజూరు చేసింది. 2015 మే 11వ తేదీన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సి.ఆర్‌.కుమారస్వామి.. విచారణ కోర్టు తీర్పును కొట్టివేశారు. జయలలిత, శశికళ సహా మిగతా ఇద్దరిపైనా అభియోగాలను రద్దుచేశారు. దీంతో.. జయలలిత అదే నెల 23వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

* జయ తదితరులను నిర్దోషులుగా విడుదల చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును వేగంగా విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. జయలలిత 2016 డిసెంబర్‌ 5వ తేదీన మరణించారు. శశికళ సహా మిగతా ముగ్గిరిపై కేసును కొనసాగించిన సుప్రీంకోర్టు తన తీర్పును మంగళవారం ప్రకటించనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement