పరిటాల కోటకు బీటలు?
సొంత పార్టీలోనే తమ్ముళ్లకు విలువ లేకుండా పోయింది. మండలాలు, గ్రామాల్లో పార్టీ ఇన్‌చార్జిలు, జన్మభూమి కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం ద్వారా పరోక్షంగా ప్రజా ప్రతినిధుల అధికారాన్ని వాళ్లకు కట్టబెట్టినట్లైంది. వీరి పెత్తనాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే భరించలేకపోతున్నారు. ఇందులో భాగంగానే కొంత కాలంగా అసమ్మతితో రగలిన తమ్ముళ్లు ఎట్టకేలకు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదంతా రాష్ట్రమంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే చోటు చేసుకోవడం గమనార్హం.
* రాజకీయ పెత్తనం భరించలేకపోతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
* రాజీనామా బాటలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ
కనగానపల్లి : పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాప్తాడు నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి రాజుకుంది. రాజకీయ పెత్తనాన్ని భరించలేని అధికార పార్టీకి చెందిన కనగానపల్లి ఎమ్పీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎమ్పీపీ వెంకట్రామిరెడ్డి కొన్ని రోజులుగా ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం వీరు పాల్గొనలేదు. జన్మభూమి కమిటీలు, పార్టీ ఇన్‌చార్జిల ఏర్పాటుతో ప్రభుత్వ కార్యకలాపాల్లో వీరికి సరైన ప్రాధాన్యత దక్కలేదు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక మొదలు మండల స్థాయి సమావేశాల్లోనూ వీరికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వీరితో పాటు మరో ఇద్దరు ఎమ్పీటీసీలు కూడా టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్పీపీ, వైస్ ఎమ్పీపీని వివరణ కోరగా వాస్తవమేనని ధ్రువీకరించారు.
అడ్డదారులలో ఎంపీపీ దక్కించుకున్న అధికార పార్టీ:
2014లో కనగానపల్లి మండలంలో జరిగిన ఎమ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీకి ఆరు, టీడీపీ ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్‌ఆర్ సీపీకి చెందిన ఇద్దరు ఎమ్పీటీసీలను టీడీపీ నాయకులు లొంగదీసుకుని ఎమ్పీపీ పదవి దక్కించుకున్నారు. పదవులను కల్పించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ నాయకులే పెత్తనం చేస్తుండడంతో టీడీపీలో అసమ్మతి రాజుకుంది. అనుకున్న రీతిలో కనగానపల్లి ఎమ్పీపీ, వైస్ ఎమ్పీపీ తమ పదవులతో పాటు ఎమ్పీటీసీ స్థానాలకు రాజీనామా చేస్తే మండలంలో పలు రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.