మండి: తెలుగు విద్యార్థుల విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి 48 విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి విహార యాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో మండి వద్ద బియాస్ నదిలో కొంతమంది విద్యార్థుల కొట్టుపోయారు. విద్యార్థులు నదిలో ఫోటోలు దిగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ల్యార్జీ డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో ఈ దారుణం సంభవించింది.
నది ప్రవాహానికి గల్లంతైన వారి సంఖ్య 20 నుంచి 24 వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరంతా హైదరాబాద్ లో వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.ఈనెల 3న విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులంతా ఇనిస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ లో రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరిలో 18 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. నది ప్రవాహానికి కొట్టుకుపోయిన వారిలో కొంతమంది ఫ్యాకల్టీలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనను నిర్ధారించిన హిమాచల్ ప్రదేశ్ డీజీపీ
గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించామన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే హిమాచల్‌ప్రదేశ్ వెళ్లాలని హోంమంత్రి నాయినిని ఆదేశించారు. దీంతో హోంమంత్రి నాయినితో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారుల బృందం రేపు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లనున్నారు. కాగా, హిమాచల్‌ప్రదేశ్ సీఎస్‌తో తెలంగాణ సీఎస్ రాజీ వ్ శర్మ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఘటన వివరాలను కొంతమంది విద్యార్థులు సాక్షి టీవీకి తెలియపరిచారు.' నా కళ్లముందు నా స్నేహితులు కొట్టుకుపోయారు.ఫోటోలు దిగుతుండగా ప్రమాదం జరిగింది. విపరీతమైన నీటి ప్రవాహానికి నా తోటి విద్యార్థులు కొట్టుకుపోయారు'అని మౌనిక అనే విద్యార్థిని సాక్షికి ఫోన్లో వివరాలను తెలుపుతూ కన్నీటి పర్యంతమైంది.