ఇన్‌ఫ్రాకు ఊరట | Sub 10% rate will do wonders to industry: NCC | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రాకు ఊరట

Published Sat, Jan 17 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

Sub 10% rate will do wonders to industry: NCC

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలుగు రాష్ట్రాల ఇన్‌ఫ్రా కంపెనీలకు ఆర్‌బీఐ నిర్ణయం కొంత ఊరట కలిగించింది.   వడ్డీరేట్లను పావు శాతం తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాలకు చెందిన ప్రధాన ఇన్‌ఫ్రా కంపెనీలకు సుమారు రూ. 400 కోట్ల వరకు వడ్డీ భారం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ రెపో రేటును మాత్రమే తగ్గించిందని, దీన్ని పూర్తిగా బ్యాంకులు కంపెనీలకు అందిస్తాయా లేదా అన్నదానిపైన ఈ ప్రయోజనం ఆధారపడి ఉంటుందని జీవీకే ఇన్‌ఫ్రా సీఎఫ్‌వో ఇసాక్ జార్జ్ తెలిపారు.
 
 పావుశాతం తగ్గింపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కానీ వడ్డీరేట్ల తగ్గింపు దిశగా ఆర్‌బీఐ అడుగులు వేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కాలంలో వడ్డీరేట్లు ఒక శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జీవీకే ఇన్‌ఫ్రాకి సుమారు రూ. 22,000 కోట్లకు పైగా రుణాలున్నట్లు తెలిపారు. ఐవీఆర్‌సీఎల్ గ్రూపునకు రూ. 8,000 కోట్లకుపైగా రుణాలున్నాయని, ఈ పావు శాతం తగ్గింపు వర్తిస్తే ఏడాది మొత్తం మీద రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఐవీఆర్‌సీఎల్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.బలరామిరెడ్డి తెలిపారు.
 
  ఈ తగ్గింపు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహిస్తుందని, ఈ పావు శాతం తగ్గింపుతో రూ. 6 కోట్లు, అదే ఒక శాతం తగ్గితే రూ. 24 కోట్ల వరకు ప్రయోజనం సమకూరుతుందని ఎన్‌సీసీ ఇన్‌ఫ్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వై.డీ మూర్తి తెలిపారు. షేర్ల పరుగులు: ఊహించని విధంగా ఆర్‌బీఐ ఒక్కసారిగా వడ్డీరేట్లను తగ్గించడంతో గురువారం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు పరుగులు తీశాయి. అత్యధికంగా జీవీకే ఇన్‌ఫ్రా 10 శాతం పెరిగితే, ల్యాంకో, జీఎంఆర్, ఐవీఆర్‌సీఎల్ షేర్లు 6 నుంచి 7 శాతం వరకు పెరిగాయి.
 
 వడ్డీభారం తగ్గుతుందిలా...
 కంపెనీ పేరు     గ్రూపు రుణ మొత్తం    పావు % తగ్గితే    1% తగ్గితే
 జీఎంఆర్ ఇన్‌ఫ్రా    45,041    135    495
 ల్యాంకో ఇన్‌ఫ్రా    36,705    110    404
 జీవీకే ఇన్‌ఫ్రా    22,464    67    247
 ఐవీఆర్‌సీఎల్    8,334    25    92
 గాయత్రీ ప్రాజెక్ట్స్    6,650    20    75
 ఎన్‌సీసీ    2,200    6    24
 (గణాంకాలు రూ. కోట్లలో..అంచనాలు ఉజ్జాయింపుగా మాత్రమే)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement