
బీజేపీ ఎంపీ స్వామి తాజాగా ఏం చేశారో తెలుసా?
న్యూఢిల్లీ: ఎపుడూ ఆరోపణలు, విమర్శలు, వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా మరో అంశంపై స్పందించి ఆసక్తికరంగా మారారు. ఆస్క్ మీ బ్రాండ్ కింద ఇ కామర్స్ వ్యాపారం నిర్వహించే గెట్ ఇట్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వేలమంది ఉద్యోగుల రక్షణ కోసం నడుం కట్టారు. 'ఆస్క్ మీ' మూతపడడంతో రోడ్డున పడ్డ నాలుగువేలమంది ఉద్యోగులకు బాసటగా నిలిచిన స్వామి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) కు లేఖ రాశారు. ఇది భవిష్యత్తులో కోర్టు విచారణకు రానున్నందున ఈ విషయంలో అత్యవసర జోక్యం అవసరమని మంత్రిత్వ శాఖ కార్యదర్శి తపన్ రేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అత్యవసర కేసుగా పరిగణించాల్సిన అవసరముందని ఆయన హెచ్చరించడం విశేషం
ఆగస్టు 31 తరువాత వ్యర్థమవుతుంది కనుక, తక్షణమే స్పందించాలని కోరారు. సంస్థ ను మూసివేయవద్దని కంపెనీ డైరెక్టర్లను కోరాలన్నారు. వేలమంది ఉద్యోగులను వదిలేయడం కాకుండా ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. మలేషియా విదేశీ సంస్థ ఆస్ట్రో లిమిటెడ్ కు చెందిన 95శాతం వాటా కొనుగోలుకు సాయం చేయాలని రాశారు.
కాగా అస్క్ మీ లో మేజర్ వాటాను కలిగిన మలేషియా సంస్థ చేతులెత్తేయడంతో ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి. తీవ్రమైన రుణభారం తదితర సమస్యలతో కంపెనీ ప్రమాదంలో పడింది. దీనిపై గెట్ ఇట్ సంస్థ జోక్యంగా చేసుకోవాల్సిందని ఎంసీఏకు లేఖ రాసింది. అప్పులను చెల్లించకుండా ఆస్ట్రోదేశంనుంచి వెళ్లడానికి వీల్లేదని కోరిన సంగతి తెలిసిందే.