మీడియా ఒత్తిడే ఆత్మహత్యకు కారణమైంది: శివ్ మీనన్
మీడియా ఒత్తిడి, వ్యక్తిగత టెన్షన్లు, వివిధ రకాల వైద్య చికిత్సలు తన తల్లి సునంద పుష్కర్ ఆత్మహత్యకు దారి తీశాయని ఆమె తనయుడు శివ్ మీనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన తల్లి మరణంపై వస్తున్న రకరకాల ఊహాగానాలను శివ్ మీనన్ కొట్టిపడేశారు. తన తల్లి, శశి థరూర్ ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయని ఆయన అన్నారు.
అయితే సందర్భానుసారంగా తలెత్తే విబేధాలు జీవితంలో సర్వసాధారణమే అని ఆయన అన్నారు. తన తల్లికి భౌతికంగా హాని తలపెట్టేలాంటి వ్యక్తి శశి థారూర్ కాదన్నారు. తన తల్లి మరణంపై మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలేనని శివ్ అన్నారు. తన తల్లి శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి కారణం కాదని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తన నివేదిక వెల్లడించిన విషయాన్ని ఆయన మీడియా దృష్టికి తీసుకువచ్చారు.