
'తెలంగాణ బిల్లు'పై 8న సుప్రీం కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వీలుగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజిత వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పిల్ను ఈ నెల 8న విచారించనున్నట్టు చీఫ్ జస్టిస్ సదాశివంతో కూడా ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవచ్చా అన్న విషయంపై కోర్టు దృష్టి సారించనుంది. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. తెలంగాణ బిల్లును అసెంబ్లీ తిరస్కరిస్తూ రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజన నిలిపి వేయాలంటూ సుప్రీంకోర్టులో ఏకంగా ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ దేశ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందంటూ వైఎస్ఆర్ సీపీ నేత సోమయాజులు వేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం స్వీకరించింది. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణను త్వరితగతిన చేపట్టాలని రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇక దేశరాజధాని ఢిల్లీ వేదికగా రాష్ట్ర విభజన హాట్ టాపిక్‌గా మారింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.