రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు
న్యూఢిల్లీ: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అలాగే శాశ్వత మిత్రులు ఉండరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జన్ లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకించడంలో బీజేపీతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ప్రభుత్వం ఏర్పడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ‘భారతదేశంలో పరిస్థితులెప్పుడైనా మారిపోవచ్చు. అదే పార్టీ మద్దతు ఇవ్వొచ్చు. మళ్లీ అదే పార్టీ వ్యతిరేకించనూ వచ్చు..’ అని న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను విధించడాన్ని సవాల్ చేస్తూ ఏఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ శుక్రవారం విచారించింది. ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి మద్దతు పలుకుతున్న పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీని వ్యతిరేకించే సందర్భాలూ ఉండవచ్చని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రిని (షీలాదీక్షిత్) ఓడించిన అభ్యర్థి (అరవింద్ కేజ్రీవాల్).. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమె పార్టీ (కాంగ్రెస్) మద్దతును పొందారన్నారు.
దీంతో అధికారం చేపట్టిన ఆ పార్టీ (ఏఏపీ) జన్ లోక్‌పాల్ బిల్లును తీసుకువస్తే.. అది అధికారంలోకి వచ్చేందుకు మద్దతు పలికిన పార్టీ.. ప్రత్యర్థి పార్టీ (బీజేపీ)తో చేతులు కలిపి ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా చేసిందని గుర్తుచేశారు. బహుశా ఈ పరిస్థితుల కారణంగానే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీని సుప్త చేతనావ స్థలో పెట్టి ఉండొచ్చునని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఈనాటి శత్రువు రేపు మిత్రుడు, మరింత మంచి మిత్రుడు కూడా అయ్యే అవకాశం ఉందని సుప్రీం పేర్కొంది. ఏదీ అసాధ్యం కాదు అనే విషయంతో పాటు రెండు పార్టీలు ఒకవేదికపై కలవలేకపోయినా మరేదైనా వేదికపై కలిసేందుకు అవకాశం ఉందనే రెండు విషయాలు ఢిల్లీ ఉదంతంతో స్పష్టమవుతున్నాయని తెలిపింది. జన్ లోక్‌పాల్ బిల్లు కాంగ్రెస్, బీజేపీలు రెండూ చేతులు కలిపేలా చేసిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.