సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు నెలాఖరులోగా తేలనుంది. ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగుతాయా ? లేక ప్రభుత్వం ఏర్పాటవుతుందా? అనే అంశంపై ఈ నెల 30వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నగర పరిధిలోని మూడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు ఉండబోవు. ఒకవేళ ఎన్నికలే జరిగినట్లయితే ఇక ఉప ఎన్నికలకు అవకాశమే ఉండదు. శాసన సభను రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలుచేసిన పిటిషన్ ఈ నెల 10న సుప్రీంకోర్టు ఎదుట విచారణకు రానుంది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రం తన వైఖరిని సుప్రీంకోర్టుకు స్పష్టం చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఎదుట తన వైఖరిని స్పష్టం చేయడాన్ని కేంద్రం వాయిదా వేసినప్పటికీ రాజ్యాంగ నిబంధనల అవశ్యకతల దృష్ట్యా ఢిల్లీ రాజకీయ భవితవ్యంపై కేంద్రం ఈ నెలాఖరులోగా నిర్ణయం వెలువడనుంది.
ఇందుకు కారణం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన హర్షవర్ధన్, ప్రవేశ్ వర్మ, రమేష బిధూడీలు లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన తరువాత శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోవడం తెలిసిందే. ఈ ముగ్గురు ఎంపీలు మే 30వ తేదీన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో వారు ప్రాతినిధ్యం వహించిన కృష్ణానగర్, మెహ్రౌలీ, తుగ్లకాబాద్ శాసనసభ నియోజకవర్గాలకు ఆరు నెలల్లోగా అంటే నవంబర్ 30వ తేదీలోగా ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలకోసం ఎన్నికల కమిషన్ కనీసం నెల రోజుల సమయం తీసుకుంటుంది. అందువల్ల ఈ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరుపుతారా ? లేక మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుపుతారా? అనే విషయం ఈ నెల 30వ తేదీలోగా తేలాల్సి ఉంది.
ఢిల్లీలో ఉప ఎన్నికలు జరుగుతాయా? లేక మొత్తం స్థానాలకు నిర్వహిస్తారా? అనే విషయం మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉందని రాజకీయ పండితులు అంటున్నారు.
ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుయచుకున్నట్టయితే ఢిల్లీ శాసనసభను రద్దు చేసి ఎన్నికలు జరిపిస్తారని, ఎన్నికల ఫలితాలు కనుక ఒకవేళ ప్రతికూలంగా వచ్చినట్టయితే ప్రభుత్వ ఏర్పాటుకు కమలదళం ప్రయత్నించవచ్చని అంటున్నారు. హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ ప్రభంజనం వీచినట్లయితే ఢిల్లీలో బీజేపీ సర్కారుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చే శాసనభ్యుల సంఖ్య పెరగవచ్చని, అలా జరిగితే సర్కారు ఏర్పాటు ఆ పార్టీకి సులభతరం కావొచ్చని కొందరు అంటున్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఢిల్లీ రాజకీయ భవితవ్యంపై నెలాఖరుకల్లా స్పష్టత!
Published Wed, Oct 8 2014 10:20 PM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM
Advertisement
Advertisement