‘ఆధార్ రాజ్యాంగబద్ధత’పై సుప్రీంకోర్టు తుది విచారణ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుల రాజ్యాంగబద్ధతను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఎస్. చౌహాన్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎం.వై. ఇక్బాల్‌లతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తుది విచారణ ప్రారంభించింది. ఆధార్ ప్రాజెక్టుకు చట్టబద్ధత లేదని పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదించారు. వ్యక్తిగత బయోమెట్రిక్ సమాచారాన్ని అందించేందుకు పౌరులు స్వచ్ఛందంగా అంగీకరించినా చట్టబద్ధతలేని ఈ ప్రాజెక్టు అమలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీనికితోడు బయోమెట్రిక్ సమాచార సేకరణ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిందని దివాన్ గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయరాదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే.