
రైతుల ఆత్మహత్యలు అసలు జరగొద్దు: సుప్రీం
దేశంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్న కేంద్రం ప్రకటనపై సుప్రీం కోర్టు సంతృప్తి చెందలేదు.
న్యూఢిల్లీ: దేశంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్న కేంద్రం ప్రకటనపై సుప్రీం కోర్టు సంతృప్తి చెందలేదు. అసలు అలాంటివి జరగనే జరగొద్దని స్పష్టం చేసింది. ‘ఆత్మహత్యలు తగ్గితే సరిపోదు. దేశంలో ఒక్క రైతు ఆత్మహత్య ఉందంత కూడా ఉండొద్దు’ అని జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన సామాజిక న్యాయ ధర్మాసనం పేర్కొంది. రైతులకు సంబంధించి ఎనిమిదేళ్లుగా అనుసరిస్తున్న విధానంలోని లోటుపాట్ల వల్ల ఆత్మహత్యలు జరుగుతుండొచ్చని, ఆ విధానాన్ని సమీక్షించే అంశంపై ఆరువారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది.
రైతుల సమస్యలపై ఏర్పాటైన ఎంఎస్ స్వామినాథన్ కమిటీ తరచూ సమావేశం కావాలని సూచించింది.
భవన కార్మికుల నిధిపై ఇంత నిర్లక్ష్యమా?
కాగా, భవన కార్మికుల సంక్షేమం నిమిత్తం సేకరించిన 27,000 కోట్ల రూపాయలు అలా ఖజానాల్లో మూలుగుతుండటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఇదే ధర్మాసనం ఆక్షేపించింది. నిధులను ఎలా వాడతారో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిధిలో నుంచి రెండున్నర కోట్లను ప్రభుత్వ ప్రకటనలకు వాడుకున్న ఢిల్లీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.