మాజీ గవర్నర్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌గా పనిచేసిన సుర్జీత్ సింగ్ బర్నాలా (91) చండీగఢ్‌లోని పీజీఐ వైద్యకళాశాల ఆస్పత్రిలో శనివారం కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పంజాబ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు. కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ప్రస్తుత హరియాణాలోని అటేలి గ్రామంలోని సంపన్న కుటుంబంలో జన్మించిన బర్నాలా.. 1946లో లక్నో యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.
కొన్నాళ్లు న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన ఆయన, 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1977 సంవత్సరంలో లోక్‌సభకు ఎన్నికై, మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1979లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసినప్పుడు బర్నాలా ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రయత్నించినా, నాటి ఉప ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్ కూడా ఆ పదవి ఆశిస్తున్నారని తెలిసి చివరి నిమిషంలో ఆగిపోయారు. తర్వాతి కాలంలో బర్నాలా 2003 జనవరి 3వ తేదీ నుంచి 2004 నవంబర్ 4వ తేదీ వరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేశారు. తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గాను, అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గాను ఆయన సేవలు అందించారు.
సీఎం సంతాపం
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌గా బర్నాలా ఏపీకి అందించిన సేవలు మరిచిపోలేనివని ఆయన అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పని చేయడం రాష్ట్రం చేసుకున్న అదృష్టమని చెప్పారు.