ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతి యత్నం
తిరుపతిలో యువకుడి బలిదాన యత్నం
తిరుపతి/ తిరుపతి కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రత్యేకహోదా జ్వాల రగిలింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోసం ఓ యువకుడు ఆత్మబలిదానానికి సిద్ధమయ్యాడు. తనువెల్లా అగ్నిజ్వాలల్లో ఆహుతవుతున్నా తెలుగుజాతి వర్ధిల్లాలని,ప్రత్యేకహోదా కల్పించాలని గొంతెత్తి అరిచాడు. పూటకో మాటతో, రోజుకో అబద్ధంతో మభ్యపెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ప్రభుత్వాధినేతల చెవులకు చేరేలా నినదించాడు. విభజన బిల్లులో ప్రత్యేకహోదా పొందుపరచకుండా కాంగ్రెస్‌పార్టీ మోసం చేస్తే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ , రాష్ర్టంలో తెలుగుదేశంపార్టీ ఉమ్మడిగా మభ్యపెడుతున్నాయని నిప్పులు చెరిగాడు. తిరుపతిలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువకుని బలిదానయత్నం వార్తలతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ రూపాల్లో పార్టీలకు అతీతంగా ఉద్యమానికి ఉద్యుక్తులవుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ తిరుపతి మంచాలవీధికి చెందిన బెంగుళూరు మునికామ కోటి అలియాస్ బీఎంకే కోటి (41) ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
‘‘సమైక్య ఉద్యమం చేసినా ఫలితం లేకపోయింది. తెలుగు జాతి విడిపోయింది. విభజనతో రాష్ట్రం అన్నింటా నష్టపోవడం చూస్తే బాధకలుగుతుండేది. ప్రత్యేకహోదాతో కొన్ని కష్టాలైనా తొలుగుతాయని ఆశపడ్డాను. కానీ సాధ్యం కాదని పార్లమెంటులో చెప్పినప్పుడు నుంచి ఒకటే ఆలోచన. కేంద్రం కళ్లు తెరవాలనే ఉద్దేశ్యంతోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాను’’ అంటూ ఆత్మఘోషను దేశానికి వినిపించాడు. తెలుగుజాతి వర్ధిలాలి.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినదించాడు. అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌పార్టీ, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేస్తామని ప్రకటించి మాటమారుస్తున్న బీజేపీ, రోజుకో మాటతో మోసపుచ్చుతున్న టీడీపీ తీరుపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాగ్నికి నిలువెత్తు సాక్ష్యంలా నిలిచాడు. ప్రత్యేకహోదాపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల మోసపూరిత వైఖరికి నిరసన తెలిపేందుకు తిరుపతిలో శనివారం కాంగ్రెస్‌పార్టీ నిర్వహించిన ‘పోరుసభ’ ను బీఎంకే కోటి వేదికగా చేసుకున్నాడు. సభ సాగుతుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సభికులు, నేతలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మంటలు ఆర్పే ప్రయత్నంలో టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగి శేషాద్రి (33)కి గాయాలయ్యాయి.వీరిద్దరినీ రుయాకు తరలించారు. అత్యవసర విభాగంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య, సీఎస్‌ఆర్‌ఎంవోలు డాక్టర్ కయ్యల చంద్రయ్య, డాక్టర్ శ్రీహరి నేతృత్వంలో వైద్య బృందం కోటికి ప్రాథమిక వైద్యసేవలు అందించింది. దాదాపు 95 శాతం శరీరం కాలిపోవడంతో బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు.
రుయా ఆసుపత్రి వద్ద ధర్నా..
రుయా చికిత్స పొందుతున్న కోటిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రారావు,, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పరామర్శించారు. కోటికి మెరుగైన వైద్యం అందలేదంటూ, ఆయన ప్రాణాలకు ఏదైనా జరిగితే దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీపీఎం నాయకులు కందారపు మురళి నేతృత్వంలో ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త త నెలకొంది. ప్రభుత్వం చేతకానితనంవల్లే కోటి బలిదానానికి సిద్ధమయ్యాడని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం నుంచి వివిధ రూపాల్లో పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తామని నినదించారు.
మొదటినుంచి ఉద్యమకారుడే..: తిరుపతిలో గతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కోటి చురుకైన పాత్ర పోషిం చాడు. ఆందోళనలో తన నిరసన గళాన్ని తెలిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.ఆత్మహత్యాయత్నానికి ముందు ఇంట్లో ‘ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంద’ని చెప్పినట్లు కోటి కుటుంబీకులు తెలిపారు.
ఘటన జరిగిన తీరు...
►3.30 గంటలకు తిరుపతిలో కాంగ్రెస్ పోరుబాట సభ వద్దకు బీఎంకే కోటి చేరుకున్నాడు.
►4.05గంటలకు సభ ప్రారంభమైంది.
►4.15 గంటలకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బీఎంకే కోటి నినాదాలు.
►4.17 గంటలకు తనతోపాటు బాటిళ్లో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు.
►4.20 గంటలకు ఒంటిపై ఎగిసిపడుతున్న మంటలతో నినాదాలు చేస్తూ సభలో పరుగులు తీశాడు.
►4.23 గంటలకు కోటికి అంటుకున్న మంటలను శేషాద్రి అనే వ్యక్తి తన చొక్కాను విప్పి ఆర్పే ప్రయత్నం చేశాడు.
► 4.28 గంటలకు కోటి, శేషాద్రిలను అత్యవసర చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమం.
►7.25 గంటలకు 95 శాతం కాలిన గాయాలతో ఉన్న కోటిని మెరుగైన వైద్య సేవల కోసం వేలూరు సీఎంసీకి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలింపు.
►7.35 గంటలకు 40 శాతం కాలిన గాయాలతో ఉన్న శేషాద్రిని కూడా మరో ప్రత్యేక అంబులెన్స్‌లో వేలూరు సీఎంసీకి తరలించారు.
భావోద్వేగాలకు లోను కావద్దు యువతకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత భావోద్వాలకు లోనై ఆత్మాహుతికి పాల్పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. కుటుంబానికి, సమాజానికి యువత చాలా ముఖ్యమనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. తిరుపతిలో కోటి అనే యువకుడి ఆత్మాహత్యాయత్న ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం తెలిపింది. ఏపీకి అన్ని రాష్ట్రాలతో పోటీపడే స్థాయి వచ్చే వరకూ సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీఎం స్పష్టం చేశారు.
ఆత్మహత్యలొద్దు.. పోరాడి సాధించుకుందాం: జగన్
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడ వద్దని, పోరాడి సాధించుకుందామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో మునికోటి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చే యడం తనకెంతో బాధ కలిగించిందని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువకుడి ప్రాణాలను రక్షించడానికి తగిన వైద్య సహాయం వెంటనే అందించాలని జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన కోరారు. మాట తప్పిన ప్రభుత్వాలు కళ్లు తెరవాలని కూడా ఆయన సూచించారు.