చంద్రబాబుతో .. టీటీడీపీ నేతల భేటీ
పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు పార్టీ ముఖ్యలు, పొలిట్‌బ్యూరో స భ్యులు శనివారం విజయవాడలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీతో సంబంధాలపై చర్చ జరిగింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, భవిష్యత్తులో బీజేపీ తో కలసి కొనసాగేదీ లేనిదీ వంటి అంశాలను బాబు టీటీడీపీ నేతలకు వివరించినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై బీజేపీ స్పందన బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, ఇది తెలంగాణకూ వర్తిస్తుంద ని తెలియజేసినట్లు తెలిసింది. కేంద్రం రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలిందేనని చంద్రబాబు సమావేశంలో పేర్కొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో పరిస్థితులపై చంద్రబాబు ఆరా...
తెలంగాణలో పార్టీ పరిస్థితిని ఆరా తీస్తూనే వివిధ అంశాలపై చంద్రబాబు చర్చ జరిపారు. తెలంగాణ నేతలు పార్టీ తరపున చేస్తున్న కార్యక్రమాలపై బాబుకు వివరించారు. పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, అమర్‌నాథ్‌బాబు హాజరయ్యారు. కాగా... వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో ఈ సమావేశానికి హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.