తార భర్త వద్ద నుంచి 36 సిమ్ కార్డులు స్వాధీనం
రాంచీ: జాతీయస్థాయి రైఫిల్ షూటర్ తారా సహదేవ్ భర్త రంజిత్ కోహ్లి అలియాస్ రాకిబుల్ హుసేన్‌కు చెందిన మూడిళల్లో జార్ఖండ్ పోలీసులు ఆదివారం సోదాలు జరిపి 36 సిమ్ కార్డులు, 15 మొబైల్ ఫోన్లు తదితర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మోసం, చిత్రహింసల ఆరోపణలపై అతన్నిపోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం సోదాలు తీవ్రతరం చేశారు. ఆయన ఇంటి నుంచి నాలుగు ప్రింటర్లు, పెన్‌డ్రై వ్‌లు, పెళ్లి సీడీ, వివాహ ఆహ్వాన పత్రికలు, కోర్టులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కోహ్లి ఇస్లాం మతంలోకి మారిన విషయాన్ని దాచి తనను పెళ్లి చేసుకున్నాడని, ఆ మతంలోకి మారాలని తనను చిత్రహింసలకు గురి చేశాడని తార ఆరోపించడం తెలిసిందే.
తాను గతంలో పెళ్లి చేసుకున్న రంజిత్ కుమార్ తాజాగా మతం మార్చుకోవాలంటూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని అసలు పేరు రాకిబుల్ హసన్ ఖాన్ అని ఆమె స్పష్టం చేసింది. తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నతరువాత కొంతకాలం వరకూ కాపురం సజావుగానే ఉన్నా.. ప్రస్తుతం మతం మార్చుకోవాలంటూ భర్త వేధింపులకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేసింది. ఒక నెల నుంచి అతని వేధింపులు మరీ ఎక్కువైనట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.