సీఐఏ ఈమెయిల్పై స్టూడెంట్ ఎటాక్ !
వాషింగ్టన్: ఓ టీనేజీ హ్యాకర్ సీఐఏ గుట్టును దొంగిలించాడు. సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెన్నాన్ వ్యక్తిగత ఈమెయిల్ను దొంగిలించడమే కాకుండా అందులోని సున్నితమైన అంశాలకు సంబంధించిన అంశాలను, రక్షణ వ్యవహారాలకు కీలక అంశాలను కూడా దొంగిలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఒక వేళ ఈ విషయాలు నిజమే అని సీఐఏ అధికారికంగా గుర్తించినట్లయితే.. సీఐఏకు గట్టి ఎదురుదెబ్బతగిలినట్లవుతుంది. ఇప్పటికే నాటి విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సీఐఏ సూచించిన ఈమెయిల్ కాకుండా ఓ ప్రైవేట్ ఈమెయిల్ ద్వారా లావాదీవీలు నెరిపిందనే వివాదం అక్కడ సంచలనం సృష్టించగా నేడు సీఐఏ డైరెక్టర్ ఈమెయిల్ హ్యాకింగ్కు గురికావడం అమెరికా రక్షణ సంస్థలో వణుకుపుట్టిస్తోంది.
సీఐఏ ఫైల్స్ను హ్యాక్ చేసిన వ్యక్తి తనను తాను ఓ అమెరికా విద్యార్థిగా చెప్పుకున్నాడు. మొత్తం 47 పేజీల్లో ఉన్న సెక్యూరిటీకి సంబంధించిన వివరాలను తాను కొల్లగొట్టానని చెప్పాడు. అయితే, సీఐఏ వర్గాలు మాత్రం ఇది ఎవరో అమెరికా విదేశాంగ విధానం నచ్చని పాలస్తీనాకు చెందిన వ్యక్తులై ఉంటారని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, అతడు ముస్లిం వ్యక్తి అయుండకపోవచ్చని కూడా అనుకుంటున్నట్లు సమాచారం.