
రగులుతున్న జ్వాల.. డిప్యూటీ సీఎం డుమ్మా!
పట్నా: బిహార్‌లోని మహాకూటమి సంకీర్ణ సర్కారులో అసమ్మతిజ్వాల ఎగిసిపడుతోంది. అధికార కూటమి మిత్రపక్షాలైన జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ తనయుడు తేజస్వి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం నితీశ్ కోరుతుండగా.. అందుకు లాలూ ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో పట్నాలో సీఎం నితీశ్‌కుమార్ పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం తేజస్వి పాల్గొనాల్సి ఉండగా.. ఆయన డుమ్మా కొట్టారు. నితీశ్‌తోపాటు తేజస్వి కూడా ఈ కార్యక్రమంలో వేదిక పంచుకోవాల్సి ఉంది. ఆయన రాకపోవడంతో ఆయన నేమ్‌ప్లేట్‌ను మొదట కనపడకుండా కవర్ చేసిన అధికారులు.. ఆ తర్వాత తొలగించారు.
ఇక అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో లాలూ కుటుంబం తమ ఆస్తుల వివరాలు, ఆదాయమార్గాలను వెల్లడించాలని సీఎం నితీశ్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం సాయంత్రంలోగా ఈ వివరాలు వెల్లడించాలని జేడీయూ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో ఈ విషయంలో లాలూ కుటుంబంపై ఒత్తిడి పెరుగుతోంది. జేడీయూ డిమాండ్‌పై సాయంత్రంలోగా లాలూ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.