
అసలు.. నకలు.. అనేదేమీ లేదు: జైరాం రమేశ్
ఉన్నది ఒక్కటే బిల్లు
ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యలు
శాసనసభ చర్చలో విభజన బిల్లుకు సవరణలు కోరవచ్చు
‘సవరణల’పై 30 తరువాత మరోమారు జీవోఎం సమావేశం
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో విభజన బిల్లును పెడతాం
అది ఆమోదం పొందుతుందా? లేదా? అనేది నేనేమీ చెప్పలేను
బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని అనడం సబబుకాదు. అయితే నేనేమీ కిరణ్‌లాగా న్యాయ, పరిపాలనా అంశాల్లో నిపుణుడిని కాదు. అన్ని అంశాలను చర్చించిన తర్వాతే న్యాయశాఖ, కేబినెట్ ఆమోదించిన బిల్లు ఇది. జీవోఎం తయారుచేసిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ఆమోదించాక బిల్లు అవుతుంది తప్ప ఇక్కడ మరో బిల్లు లేదు. అసలు.. నకలు అంటూ ఏదీ ఉండదు. దీనిపై చర్చ అవసరం లేదు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లు అని.. అసలు బిల్లు, నకలు (ముసాయిదా) బిల్లు అని ఏదీలేదని.. మరో బిల్లు ఏదీ ఉండదని.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేశ్ స్పష్టంచేశారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ, మంత్రివర్గం ఆమోదం పొందాకే రాష్ట్రపతికి పంపామని చెప్పారు. రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి పంపిన ఈ బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించటం సబబు కాదన్నారు. అయితే.. ఈ బిల్లు అసెంబ్లీ నుంచి తిరిగి రాష్ట్రపతికి అటునుంచి పార్లమెంటుకు వచ్చే వరకూ ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియదని వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్రానికి చెందిన గ్రామపంచాయతీలతో గ్రామీణాభివృద్ధి శాఖ ఒప్పందం కార్యక్రమం అనంతరం జైరాం మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విభజన బిల్లుపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఠ అసెంబ్లీ చర్చలో బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చని.. సవరణలు కూడా కోరవచ్చని జైరాం పేర్కొన్నారు. బిల్లుకు ఎలాంటి సవరణల ప్రతిపాదనలు వచ్చినా.. తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈ నెల 30వ తేదీ తరువాత మరోమారు సమావేశమై వాటిని పరిశీలిస్తుందని జీవోఎం సభ్యుడైన ఆయన చెప్పారు.
ఠ ‘అసెంబ్లీలో మెజారిటీ అభిప్రాయం విభజనకు వ్యతిరేకంగా వస్తే ఎలా వ్యవహరిస్తారు?’ అని ప్రశ్నించగా.. బిల్లుపై అసెంబ్లీ నుంచి వచ్చే అన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన బదులిచ్చారు. ‘‘విభజన విషయంలో రాజ్యాంగంలోని 3, 4 అధికరణల ప్రకారమే ముందుకు వెళుతున్నాం. ఎక్కడా వాటిని దుర్వినియోగం చేయటం లేదు. ఈ అధికరణల ప్రకారం రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చేసే సర్వహక్కులు కేంద్రానికి ఉన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులు కూడా మావద్ద ఉన్నాయి’’ అని వివరించారు.
ఠ సీమాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోలేదనే విమర్శలపై జైరాం స్పందిస్తూ.. ‘‘తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీల అంశాలను ప్రస్తావించాం. వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో పొందుపరిచాం. ఒకవేళ ఇంకా ఏవైనా సవరణలు ఉంటే చెప్పవచ్చు. వాటిని పరిశీలిస్తాం’’ అని చెప్పారు.
ఠ రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని జైరాం స్పష్టం చేశారు. అయితే.. బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అనేది తాను చెప్పలేనని మరో ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు.