
26 లోగా అసెంబ్లీకి టీ-బిల్లు?
తెలంగాణ బిల్లు నవంబర్ 26కల్లా అసెంబ్లీకి వస్తుందని ఢిల్లీలోని ఉన్నత స్థాయి వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు నవంబర్ 26కల్లా అసెంబ్లీకి వస్తుందని ఢిల్లీలోని ఉన్నత స్థాయి వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. శుక్రవారం హస్తినలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ భేటీలో కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తదితర రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు ఈ మేరకు తెలియజేశారంటున్నారు. ఆ ప్రక్రియ సజావుగా సాగిపోయేలా చూడాలని ఈ సందర్భంగా కిరణ్‌ను అధిష్టానం ఆదేశించిందని, అందుకాయన అంగీకరించారని సమాచారం.
రాష్ట్ర విభజనకు సీఎం అంగీకరించారని సమన్వయ భేటీకి అధ్యక్షత వహించిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఆ భేటీ అనంతరం విలేకరులకు స్పష్టం చేయడం తెలిసిందే. విభజనపై తన వైఖరి మారలేదని శనివారం కిరణ్ పైకి విలేకరులతో చెప్పినా, వాస్తవానికి విభజన ప్రక్రియకు ఇకపై కూడా పూర్తిగా సహకరించేలా ఆయన నుంచి అధిష్టానం స్పష్టమైన హామీ తీసుకున్నట్టు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. బయటికి మాత్రం తెలంగాణ, కోస్తాంధ్ర నేతలు ఎవరి ప్రాంతానికి తగినట్టుగా వారు మాట్లాడుతూనే ఉండాలని, ఎప్పట్లాగే వాటిని తాము చూసీ చూడనట్టే పోతామని అధిష్టానం సూచించిందని కూడా తెలుస్తోంది. ‘విభజన ప్రక్రియ’లో మిగిలిన పర్వాన్ని సజావుగా ముందుకు నడిపేందుకు సారథ్యం వహిస్తానంటూ రెండు రోజుల హస్తిన పర్యటన సందర్భంగా అధిష్టానానికి కిరణ్ మాటిచ్చారని కాంగ్రెస్‌లోని ఉన్నతస్థాయి వర్గాలు కూడా శనివారం ధ్రువీకరించాయి.
వాటి కథనం మేరకు.. ఈ నెల 26 కల్లా బిల్లును అసెంబ్లీ అభిప్రాయం నిమిత్తం పంపాలని అధిష్టానం వ్యూహరచన చేసింది. ఈ వ్యూహాన్ని తూచా తప్పకుండా అమలుచేయాల్సిందిగా కిరణ్‌కు ఆదేశాలిచ్చి హైదరాబాద్ పంపింది. ఆ మేరకు ఈ నెల 25 లేదా 26ల్లో శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచటానికి ఆయన ఇప్పటికే చర్యలు చేపట్టారని తెలుస్తోంది. అదే సమయంలో.. బిల్లు అసెంబ్లీలో చర్చకొచ్చే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి దానిపై తీవ్రస్థాయి ప్రతిఘటన వచ్చేలా పథక రచన చేశారని, తద్వారా కాంగ్రెస్సే సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తోందన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పావులు కదుపుతున్నారని సమాచారం.
18 నాటి జీవోఎం భేటీయే కీలకం
కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్న ప్రకారం ఈ నెల 18వ తేదీన సీమాంధ్ర కేంద్ర మంత్రులతో కేంద్ర మంత్రుల బృందం నిర్వహించే సమావేశమే జీవోఎం సమావేశాలన్నింట్లో కీలకం కానుంది. ఆ రోజున సీమాంధ్ర కేంద్ర మంత్రులతో మాట్లాడిన తర్వాత తమ నివేదికకు తుది మెరుగులు దిద్దటాన్ని జీవోఎం పూర్తిచేస్తుందని, వెంటనే ఈ నివేదికను కేబినెట్ ఆమోదం నిమిత్తం పంపుతారని తెలుస్తోంది. 18న నిర్వహించే భేటీతో జీవోఎం సమావేశాలు పూర్తికావచ్చని, అవసరమనుకుంటే మరో భేటీ ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 21న గురువారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను చర్చించి ఆమోదముద్ర వేయవచ్చని అంటున్నారు.
రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి...: కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పడ్డ వెంటనే బిల్లు నేరుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వెళ్తుంది. దీన్ని పరిశీలించి ఆయన రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపుతారు. బిల్లుపై చర్చించి అభిప్రాయం చెప్పటానికి రాష్ట్ర అసెంబ్లీకి ఎంత సమయం ఇస్తారన్న విషయం పూర్తిగా రాష్ట్రపతి విచక్షణాధికారంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. ఆయన రెండు వారాల కంటే ఎక్కువ సమయం ఇవ్వకపోవచ్చునని కేంద్రం అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించుకున్న షెడ్యూలు ప్రకారం అన్నీ సవ్యంగా సాగితే రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్రపతి నుంచి ఈ నెల 26 నాటికి అసెంబ్లీకి చేరుతుంది. అసెంబ్లీ అభిప్రాయం రాష్ట్రపతికి చేరిన తర్వాత రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టాలనే విషయమై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంటాయని ఉన్నతస్థాయి వర్గాలు వివరించాయి. పార్లమెంటు సమావేశాల ప్రథమార్ధంలోనే బిల్లును పెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటివరకు ఉందని.. ఇకమీదట జరిగే పరిణామాలపై ఆధారపడి కచ్చితమైన తేదీని నిర్ణయిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.