
ఇక హస్తిన చేతిలో
తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై రాష్ట్ర శాసనమండలి, శాసనసభ అభిప్రాయ సేకరణ ఘట్టం ముగిసింది.
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై రాష్ట్ర శాసనమండలి, శాసనసభ అభిప్రాయ సేకరణ ఘట్టం ముగిసింది. బిల్లుపై శాసనసభలో చర్చ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య గురువారం ముగిసింది. ‘రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో పూర్తవుతున్నందున చర్చకు ముగింపు పలికి, సభ అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపించనున్నాం’ అని స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రకటించారు. అనంతరం, ముఖ్యమంత్రి కిరణ్ ఇచ్చిన నోటీసు దరిమిలా సభలో ఉత్పన్నమైన గందరగోళ పరిస్థితుల మధ్య బిల్లుపై ఓటింగ్‌కు ఆస్కారం లేకుండానే చర్చ ప్రక్రియకు తెరపడింది. బిల్లుపై సభ వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నింటినీ రాష్ట్రపతికి పంపిస్తామని తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్యే స్పీకర్ ప్రకటించారు.
ఆ తర్వాత, ‘విభజన బిల్లును తిరస్కరిస్తూ, దాన్ని పార్లమెంటుకు పంపొద్దని రాష్ట్రపతిని కోరుతూ సభ తీర్మానం చేయాలి’ అంటూ కిరణ్ ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ సభలో ప్రవేశపెట్టారు. దాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించినట్టు తీవ్ర గందరగోళం, సీమాంధ్ర-తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల తోపులాటల మధ్యే ప్రకటించారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు. కిరణ్ తీర్మానాన్ని ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటిస్తున్న సమయంలో సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. స్పీకర్ వైపు దూసుకెళ్లడానికి తెలంగాణ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించగా సీమాంధ్ర సభ్యులు వారిని అడ్డుకున్నారు.
అంతా ఆ మూడు నిమిషాల్లోనే...
విభజన బిల్లుపై చర్చకు గురువారం చివరి రోజు కావడంతో సభలో గంభీరమైన వాతావరణం నెలకొంది. పార్టీలకు అతీతంగా ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులూ రెండు వర్గాలుగా మోహరించారు. సభ జరిగింది మూడు నాలుగు నిమిషాలే అయినా ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన ప్రతి సభ్యుడిలోనూ కన్పించింది. సభ ప్రారంభం కాకముందే ఇరు ప్రాంతాల సభ్యులూ పోడియం వద్దకు చేరుకోవడానికి పోటీ పడ్డారు. గురువారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమవగానే ఇరు ప్రాంతాల సభ్యులూ పోడియం వద్దకు చేరుకుని తెలంగాణ, సమైక్య నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరి రోజైనందున చర్చలో పాల్గొనాలని, సభను అడ్డుకోవద్దని స్పీకర్ సూచించినా పట్టించుకోలేదు. దాంతో నాలుగు నిమిషాలకే ఆయన సభను వాయిదా వేశారు. మళ్లీ 11.05 గంటలకు సభ ప్రారంభమైంది. వెంటనే సభ్యులు పోడియం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించాలని, ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్ కోరడంతో అంతా కూర్చుండిపోయారు. వెంటనే 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ వెంటనే సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించి వెళ్లిపోయారు.
ఇలా ఆమోదం.. అలా వాయిదా
సాధారణంగా సభ వాయిదా పడగానే సభ్యుల్లో మూడొం తులు బయటకు వెళ్లిపోతారు. గురువారం మాత్రం సభను పది నిమిషాలు వాయిదా వేసినా ఎవరూ బయటికి వెళ్లలేదు. అక్కడే ఉండి పార్టీలవారీగా పరస్పరం మాట్లాడుకోవటం కనిపించింది. పది నిమిషాలవగానే సభ్యులు క్రమంగా పోడియం వద్దకు వచ్చి మోహరించడం మొదలుపెట్టారు. తొలుత సీమాంధ్ర సభ్యులు పోడియం వద్ద ఉన్న మార్షల్స్‌కు ముందు వరసలుగా నిలబడ్డారు. ముందు మహిళా సభ్యులు నిలబడ్డారు. దీన్ని గమనించిన తెలంగాణ ఎమ్మెల్యేలు వారిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే సభ ప్రారంభానికి సూచనగా బెల్లు మోగింది. దాంతో తెలంగాణ-సీమాంధ్ర సభ్యుల మధ్య తోపులాట మొదలైంది. ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. ఆ హడావుడిలోనే స్పీకర్ వచ్చి, బిల్లుపై చర్చ జరిగిన తీరును సభకు వివరించారు. ‘బిల్లుపై చర్చ ముగిసింది. దానిపై సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు’ అని స్పష్టం చేశారు.
బిల్లును రాష్ట్రపతికి పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం, సీఎం అధికార తీర్మానంతో పాటు మరో పది అనధికార తీర్మానాలందాయని చెప్పిన స్పీకర్, వాటన్నింటినీ సభలో ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. కిరణ్ తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు అవుననీ, వ్యతిరేకంగా ఉన్నవారు కాదని చెప్పాలంటూనే... ‘మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించి’నట్టు సభలో అరుపుల మధ్య ప్రకటించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు, కావేటి సమ్మయ్య తదితరులు స్పీకర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా సీమాంధ్ర సభ్యులు వారిని అడ్డగించారు. దాంతో వారి భుజాల పైనుంచి స్పీకర్‌కేసి వెళ్లడానికి టీఆర్‌ఎస్ సభ్యులు ప్రయత్నించారు. స్పీకర్ ముందు భాగంలో చర్చల వివరాలను నమోదు చేసుకునే అసెంబ్లీ సిబ్బంది కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి, అక్కడి నుంచి స్పీకర్ వైపు దూకేందుకు ప్రయత్నించారు. సీమాంధ్ర సభ్యులు అడ్డగించడంతో ఒక దశలో హరీశ్ రెండుసార్లు సభ్యుల మధ్య కిందపడిపోయారు.
స్పీకర్ ప్రకటన పూర్తి పాఠం...
తొలి పేజీలో...
‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై ఆంధ్రప్రదేశ్ శాసన సభ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని కోరుతూ రాష్ట్రపతి గడువిచ్చారు. రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం పంపిన ఆ బిల్లుపై ఇచ్చిన గడువు నేటితో ముగుస్తుంది. ఆ కారణంగా చర్చకు ముగింపు పలకాల్సిన ఆవసరముంది.
బిల్లును 2013 డిసెంబర్ 16న సభ ముందుంచడం జరిగింది. దానిపై జరిగిన చర్చలో 86 మంది సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 53.05 గంటల పాటు చర్చ జరిగింది. సభలోని దాదాపు అందరు సభ్యులు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేశారు. అవన్నీ కూడా అధికారిక రికార్డుల్లో భాగమే.
బిల్లుపై సవరణలు, అభిప్రాయాలు కోరుతూ లిఖిలపూర్వక ప్రతిపాదనలందాయి. బిల్లులోని క్లాజులపై సభ్యులిచ్చిన 9,072 ప్రతిపాదనలను కూడా అధికారిక రికార్డుల్లో భాగంగా చేర్చాం. సభా వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశంలో అంగీకరించిన మేరకు ఈ అధికారిక రికార్డులను సభ అభిప్రాయాలుగా రాష్ట్రపతికి నివేదిస్తాం’’
రెండో పేజీలో...
‘‘ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక తీర్మానం, మరో 10 అనధికార తీర్మానాలు నాకందాయి. వాటి ప్రతులను సభ్యులకు పంపిణీ చేశాం. వాటన్నింటినీ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ తీర్మానాన్ని సభ ముందుంచుతున్నాం. ఆ తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు అవుననీ, వ్యతిరేకంగా ఉన్నవారు కాదని చెప్పండి. (అవుననీ, కాదనీ సభలో నినాదాలు) తీర్మానం ఆమోదించడమైనది. ప్రభుత్వం ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించినందున అదే అంశంపై అందిన అనధికార తీర్మానాలను చేపట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. సభ నిర్వహణలో సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు. శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నా.’’