సాక్షి, హైదరాబాద్ : గత అసెంబ్లీ సమావేశాలలో వివిధ శాఖలకు సంబంధించి శాసనమండలి, శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను లెజిస్లేచర్ సెక్రటేరియట్ వెబ్‌సైట్‌కు వెంటనే అప్లోడ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో శాసనమండలి, శాసనసభ పెండింగ్ ప్రశ్నలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్ల నిర్వహణ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమీక్షించారు.
వివిధ శాఖలకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్స్ ఇవ్వడం జరిగిందని, ఆయా శాఖలు తమ సమాధానాలను పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ఈ నెలలో ప్రారంభమయ్యే సమావేశాలకు సంబంధించి బిల్లులు, అమెండ్‌మెంట్స్‌లకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల సమన్వయం, పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, టార్గెట్స్ అచీవ్‌మెంట్స్, వివిధ పారామీటర్స్‌కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను క్లుప్తంగా శాఖల వారిగా రూపొందించి ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖ నుండి నోడల్ అధికారిని నియమించుకొని శాసనసభ అధికారులతో సమన్వయం చేసుకునేలా చూడాలన్నారు.
సమాధానాలు క్లుప్తంగా, ఖచ్చితమైన సమాచారంతో ఉండాలని, అనుబంధ విషయాలు ప్రత్యేక నోట్ రూపంలో ఉండాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన వెబ్‌సైట్లలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించాలన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మాస్టర్ డేటా ఇంటిగ్రేషన్‌పై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment