
‘టీ నోట్’ ముసాయిదా మాత్రమే సిద్ధమైంది: షిండే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించి కేబినెట్ ముందుంచాల్సిన నోట్‌ను ఇంకా ఖరారు చేయలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. దాని తాలూకు ముసాయిదా మాత్రమే సిద్ధమైందని సోమవారం వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జరగనున్న మంత్రివర్గ సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం చోటుచేసుకోలేదన్నారు. దాంతో ఈ భేటీలో నోట్ ప్రస్తావన గానీ, దానిపై చర్చ గానీ ఉండబోవని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని మన్మోహన్‌సింగ్ విదేశీ పర్యటన తర్వాత అక్టోబర్‌లో మాత్రమే తెలంగాణపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. సాధారణంగా కేంద్ర కేబినెట్ ప్రతి గురువారం సమావేశమవుతుంది. అయితే ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని బుధవారం న్యూయార్క్ బయల్దేరుతున్నందున దాన్ని ముందుగానే నిర్వహిస్తున్నారు.
మరోవైపు... ఎజెండాలో లేకపోయినా తెలంగాణ నోట్ ముసాయిదాను మంగళవారం నాటి భేటీలోనే మంత్రులందరికీ పంచుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దానిపై చర్చ కూడా జరుగుతుందని కాంగ్రెస్ నేతల్లో మరికొందరు అంటున్నారు. ఇప్పటికే తయారైన 6, 7 పేజీల ముసాయిదాను వీలైనంతగా సంక్షిప్తీకరించి కేబినెట్ ముందు పెడతారని వారు చెబుతున్నారు. ఈ ముసాయిదానే కేంద్ర హోం మంత్రి సంతకంతో తుది నోట్ రూపంలో బహుశా అక్టోబర్ 3న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుంచుతారన్నది వారు చెబుతున్న మాట.
‘‘రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఎంతటి వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమవుతున్నా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. నోట్ కేబినెట్ ముందుకు వెళ్తే తక్షణం రాజీనామా చేసేందుకు కనీసం అరడజను మంది సీమాంధ్ర ఎంపీలతో పాటు ఆ ప్రాంతాలకు చెందిన పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో... అలాంటి పరిణామానికి కూడా అధిష్టానం సిద్ధంగానే ఉంది’’ అని ఏఐసీసీ వర్గాలను ఉటంకిస్తూ సదరు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ భేటీపైనే నెలకొంది.