న్యూఢిల్లీ: దేశీయ మల్టీబ్రాండ్ రిటైలింగ్‌లో ప్రవేశించేందుకు యూకే రిటైలింగ్ దిగ్గజం టెస్కోకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతి లభించింది. దీంతోపాటు దేశీయ మొబైల్ దిగ్గజంలో మైనారిటీ వాటాదారుల వాటాను కొనుగోలు చేసేందుకు వొడాఫోన్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల పరిమితిని పెంచే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆర్థికశాఖ వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి.
తొలి దశలో భాగంగా టెస్కో 11 కోట్ల డాలర్లను(రూ. 7,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్ హైపర్‌మార్కెట్స్‌లో 50% వాటాను కొనుగోలు చేయనుంది. ఇక మరోవైపు వొడాఫోన్ ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనల్జిత్ సింగ్‌కు గల 24.65% వాటాతోపాటు అజయ్ పిరమల్‌కు చెందిన 10.97% వాటాను బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు రూ. 10,141 కోట్లను వెచ్చించనున్నట్లు అంచనా.